Health Tips : మనం అప్పుడప్పుడు సహజంగానే కొన్ని కారణాల వల్ల గాయాల బారిన పడుతుంటాం. కొన్ని సార్లు పుండ్లు అవుతుంటాయి. అయితే అలాంటి సమయంలో పప్పు తినకూడదని, తింటే ఆ ప్రాంతంలో చీము పడుతుందని చెబుతుంటారు. ఇంతకీ అసలు ఇందులో నిజం ఉందా ? గాయాలు, పుండ్లు అయినప్పుడు నిజంగానే పప్పును తినకూడదా ? ఇందుకు వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారు ? అంటే..
గాయాలు, పుండ్లు అయినప్పుడు పప్పు తింటే చీము పడుతుందని అనడంలో ఎంతమాత్రం నిజం లేదు. అదంతా వట్టిదే అని డాక్టర్లు చెబుతున్నారు. గాయాలు, పుండ్లు అయినప్పుడు భేషుగ్గా పప్పు తినవచ్చని అంటున్నారు. నిజానికి అలాంటి స్థితిలో పప్పు తింటేనే మంచిదట. ఎందుకంటే పప్పులో ప్రోటీన్లు బాగా ఉంటాయి. అవి గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేస్తాయి. అందువల్ల గాయాలు, పుండ్లు అయినప్పుడు పప్పును నిరభ్యంతరంగా తినవచ్చు. అంతేకానీ ఆ స్థితిలో పప్పును తింటే చీము పడుతుందని అస్సలు అనుకోరాదు. భేషుగ్గా పప్పును తినవచ్చు.
అయితే మరి గాయాలు, పుండ్లు అయినప్పుడు అసలు చీము ఎందుకు పడుతుంది ? అంటే.. అందుకు పలు కారణాలు ఉన్నాయి. అవేమిటంటే.. గాయాలు లేదా పుండ్లు అయినప్పుడు వాటిని రోజూ శుభ్రం చేయాలి. లేదంటే ఇన్‌ఫెక్షన్ అయి చీము పడుతుంది. ఇక వాటి స్థానంలో సూక్ష్మ క్రిములతో తెల్ల రక్త కణాలు పోరాటం చేస్తాయి. దీంతో అవి చనిపోతాయి. ఈ క్రమంలో అవి చీముగా మనకు కనిపిస్తాయి.
అలాగే గాయాలు, పుండ్లు మానడం ఆలస్యమైనా అవి ఇన్‌ఫెక్షన్‌కు దారి తీసి చీము పడుతుంది. దీంతోపాటు దుమ్ము, ధూళి ఎక్కువగా పడడం, పలు రకాల ఆహారాలను తినడం వల్ల అవి మానడం ఆలస్యం అవుతుంది. ఈ క్రమంలో చీము ఎక్కువగా చేరుతుంది. చీములో చనిపోయిన కణాలు, ఇతర కణజాలం, తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే చీముకు, పప్పుకు ఎంతమాత్రం సంబంధం లేదు. గాయాలు, పుండ్లు అయినవారు నిరభ్యంతరంగా పప్పును తినవచ్చు. దాంతో చీము ఏమీ పట్టదు.