రైలుకి సంబంధించి బోగీ – కోచ్ – కంపార్టుమెంట్ ఈ మూడు పదాలను ఒకదానికొకటి పర్యాయపదాలుగా వాడేస్తుంటాము. ఈ మూడూ కూడా ఇంగ్లీషు పదాలే. కాని, బోగీ ని తెలుగు పదంగా భావించి వారి అచ్చతెనుగు సంభాషణలలోనూ, వ్యాసాలలోనూ చాలామంది వాడడం చూశాను. బోగీ (bogie) అనేది ఆంగ్ల పదం. Bogie అని Google లో టైపు చేసి బొమ్మలు చూడండి. మీకు కనిపించే బొమ్మలు వేరే విధంగా వుంటాయి. అవునండీ, అదే బోగీ అంటే! మొదటి సారి చూసినపుడు నేనూ నమ్మలేదు. వెంటనే Oxford డిక్షనరీలో చూశాను. నమ్మక తప్పలేదు. ఒరిజినల్ ఇంగ్లీషు పదానికి మనవాళ్ళు మరొక అర్థాన్ని సృష్టించి వాడుతున్నట్లుగా తెలిసింది.
నాలుగు చక్రాలు, రెండు ఇరుసులు కలిగిన ఈ యూనిట్ ఒక బోగీ. అయితే, మరి coach అంటే ఏమిటి? ఒక రైలు పెట్టెనే కోచ్ అంటారు. తాత్కాలికంగా తగిలించిన చక్రాలు ఉన్నాయి. బోగీలను తగిలించి కోచ్ ను వాడకంలోకి తీసుకువస్తారు. ఈ విధంగా ప్రతి కోచ్ కు ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి రెండు బోగీలు ఉంటాయి. బోగీలు, కోచ్ ల గురించి, వాటి మధ్య తేడాలు అర్థమయ్యాయనుకుంటున్నాను. ఇక కంపార్ట్మెంట్ విషయానికి వద్దాం. కంపార్ట్మెంట్ అంటే, విభాగము అని అర్థం. మొత్తం ట్రైన్ లో ఒక్కొక్క coach ఒక్కొక్క విభాగం అనే అర్థంలో కోచ్ నే కంపార్ట్మెంట్ అని అంటూ వుంటాం. మన దేశంలో కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాని, కంపార్ట్మెంట్ ఫ్యాక్టరీలు లేవు. కాబట్టి coachను కంపార్ట్మెంట్ అనడం రైల్వే వారి పరిభాష కాదు. ఒక్కొక్క కోచ్ లోనూ విభాగాలు 9 వరకూ ఉంటాయి. వాటినొక్కక్క దానిని ఒక్కొక్క కంపార్ట్మెంట్ గా పరిగణిస్తారు.
ఇవి కాకుండా ఇంకా కేబిన్ (Cabin), కూపే (Coupe) అనేవి I A/C కోచ్ లలో కనిపిస్తాయి. కేబిన్ లో నాలుగు బెర్త్ లు, కూపే లో రెండు బెర్త్ లు మాత్రమే వుంటాయి. మీరు ఎప్పుడు టికెట్ రిజర్వు చేసుకున్నా టికెట్ పై Coach నెంబర్ అని మాత్రమే ఉంటుంది కాని, బోగీ అనో, కంపార్ట్మెంట్ అనో వుండదు. కాబట్టి ఇకపై ప్రయాణం చేసేడప్పుడు టికెట్ పై చూపిన కోచ్ లోకి ఎక్కి, మీ బెర్త్ నెంబర్ యే కంపార్ట్మెంట్ లో ఉందో చూసుకొని అక్కడే కూర్చోండి. మీకు రిజర్వేషన్ ఉన్నా లేకున్నా సరే ఏ బోగీ లోకీ దూరే ప్రయత్నం చెయ్యకండి. అది చాలా ప్రమాదకరం.