బంగారం అంటే ఇష్టం ఉండనిది ఎవరికి చెప్పండి. ఆడవారితోపాటు మగవారు కూడా బంగారు ఆభరణాలను ధరించేందుకు ఆసక్తిని కనబరుస్తారు. ఇక శుభకార్యాలప్పుడు అయితే బంగారు ఆభరణాల విలువ ఏంటో అందరికీ తెలిసిందే. అవే కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. అందుకే బంగారం అంటే చాలా మందికి ఇష్టం. అయితే ఇదంతా సరే.. అసలు బంగారం భూమిలో ఏలా ఏర్పడింది..? అది అక్కడ ఎలా పుట్టుకు వచ్చింది..? తదితర వివరాలు మీకు తెలుసా..? అవే ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం ఇతర విలువైన లోహాలు భూమి లోపల ఎలా ఏర్పడ్డాయనే దానిపై రకరకాల పరిశోధనలు, సిద్ధాంతాలు ఇప్పటికే మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఓ సైంటిస్టు బృందం చేసిన పరిశోధన ఈ లోహాలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. భూగ్రహం ఏర్పడే సమయంలో చంద్రుని పరిమాణం అంత ఉన్న ఓ భారీ గ్రహ శకలం భూమిని ఢీకొని దానిలోకి చొచ్చుకుపోయిందని ఆ తర్వాత అది భూఅంతర్భాగంలో పలు ప్రక్రియలకు గురై బంగారం, ప్లాటినంలాంటి లోహాలు ఉద్భవించాయని పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ ప్రక్రియ వల్లే బంగారం ఏర్పడిందట. దీంతోపాటు ఇతర లోహాలు కూడా ఇదే ప్రక్రియ వల్ల ఏర్పడినట్టు సైంటిస్టులు గుర్తించారు.
అయితే భూమి లోపల ఉన్న బంగారం సహా ఇతర లోహాల పరిమాణాన్ని సైంటిస్టులు గతంలో తక్కువగా అంచనా వేశారు. కానీ ఇప్పుడు వారు మరో కొత్త అంచనాకు వచ్చారు. దాని ప్రకారం భూమిలో గతంలో కన్నా 5 రెట్లు ఎక్కువగా ఆయా లోహాలు ఉండే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అవును మీరు వింటున్నది కరెక్టే. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే. అంటే.. మనకు ఇంకా లెక్కకు మించి బంగారం భూమిలో లభిస్తుందని సైంటిస్టుల పరిశోధనల ద్వారా తెలిసినట్టే కదా. ఏది ఏమైనా.. బంగారం ఇలా ఏర్పడిందంటే.. నమ్మశక్యంగా లేదు కదా..!