చలికాలంలో మనం 10, 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే తట్టుకోలేకపోతుంటాం. చలి దెబ్బకు రాత్రి నుంచి ఉదయం మధ్యలో బయటికి వెళ్లరు. ఒక వేళ వెళ్లాల్సి వచ్చినా పకడ్బందీ ఏర్పాట్లతోనే బయట తిరుగుతారు. కానీ మన దగ్గర చలి ఇలా ఉంటేనే భరించలేకపోతున్నాం, రష్యాలోని ఆ గ్రామంలో చలి తీవ్రత ఎలా ఉంటుందో తెలుసా..? సాధారణ సమయాల్లోనే అక్కడ -30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక చలి కాలం వస్తే అది కాస్తా -71 డిగ్రీల వరకు వెళ్తుంది. ఇప్పుడు ఆ గ్రామంలో ఉష్ణోగ్రత -50 డిగ్రీలు ఆ పైనే నమోదవుతోంది. అయినా అక్కడి ప్రజలు ఆ ఉష్ణోగ్రతలకు, వాతావరణ పరిస్థితులకు అలవాటు పడిపోయారు. ఇంతకీ ఆ గ్రామం పేరేంటో తెలుసా..? ఓయంయాకోన్ (Oymyakon). రష్యాలోని యాకుత్స్‌క్ అనే రీజనల్ క్యాపిటల్ సిటీకి చాలా కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ గ్రామం. ఆ సిటీ నుంచి ఆ గ్రామానికి వెళ్లాలంటే రెండు రోజుల పాటు వాహనంలో ప్రయాణించాల్సి ఉంటుంది.
1924వ సంవత్సరంలో ఓయంయాకోన్ గ్రామంలో -71.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఇప్పటి వరకు ఆ గ్రామంలోనే కాదు, భూమిపై మనుషులు నివసించే ప్రాంతాల్లో నమోదైన అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఇదేనట. దీంతో ఆ గ్రామం భూమిపై మనుషులు నివసించే ప్రాంతాల్లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే గ్రామంగా రికార్డులకెక్కింది. ఈ క్రమంలో సదరు ఉష్ణోగ్రతను సూచిస్తూ ఆ గ్రామంలో ఓ సూచిక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి ది పోల్ ఆఫ్ కోల్డ్ అనే పేరు పెట్టారు. కాగా ఉత్తరార్థ గోళంలో మనుషులు ఉండే ప్రాంతంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత కూడా ఇదే గ్రామానికి చెందడం విశేషం. అయితే అక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయో తెలుసా..? 500 కుటుంబాలు. వారందరి ఆహారం పశు మాంసం. స్థానికంగా పశుపోషకులు పెంచే దుప్పులు, గుర్రాల మాంసంతోపాటు ఆవు పాలు, పెరుగు, నెయ్యి వారు తింటారు. అయితే నిత్యం మాంసం తిన్నా వారిలో పౌష్టికాహార లోపం లేదు. అయితే ఆ కుటుంబాలన్నింటికీ మాత్రం కేవలం ఒకే షాప్ ద్వారా ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు అందుతాయి.
పశువులను పెంచే వారు వాటిని రోజూ దగ్గర్లోనే ఉన్న ఓ వేడి నీటి సరస్సు వద్దకు వెళ్లి వాటిని కడుగుతారు. అలాగే ఆ సరస్సు నుంచి పాయలుగా వచ్చే వేడి నీటిని స్థానికులు వాడుతారు. ఈ క్రమంలో అక్కడి ప్రజలకు కరెంటు, వేడి గాలిని అందించేందుకు ఓ పవర్ స్టేషన్ నిత్యం పని చేస్తూనే ఉంటుంది. అందులో బొగ్గు, కలపను మండిస్తారు. అయితే ఆ పవర్ స్టేషన్ మాత్రం ఎప్పుడూ పని చేయాల్సిందే. ఒక 5 గంటల పాటు పనిచేయకపోతే మాత్రం ఇక ఆ గ్రామ వాసులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా ఓయంయాకోన్ గ్రామంలో ఉండే విపరీత పరిస్థితుల కారణంగా అక్కడ మొబైల్ ఫోన్లు పనిచేయవు. పెన్నుల్లో ఉండే ఇంకు గడ్డ కడుతుంది. దీంతో వాటితో రాయలేరు. అదేవిధంగా అక్కడి ప్రజలు వాహనాలను ఎప్పటికీ ఆన్‌లోనే ఉంచుతారు. ఎందుకంటే చలి కారణంగా ఒకసారి ఇంజిన్ ఆఫ్ అయితే మళ్లీ దాన్ని స్టార్ట్ చేయడం చాలా కష్టం. ఈ క్రమంలో వాహనాల బ్యాటరీలు కూడా పవర్‌ను కోల్పోతాయి. అయితే అంతటి గడ్డ కట్టించే చలి ఉన్నా అక్కడి ప్రజల టాయిలెట్లు మాత్రం ఇంటి బయటే ఉంటాయి. కాగా అక్కడ ఎవరైనా చనిపోతే దహనం చేయడం ఉండదు. శవాలను పూడ్చి పెడతారు. అయితే శవం కోసం గొయ్యి తవ్వేందుకు మాత్రం వారికి 3 రోజుల సమయం పడుతుందట. ఎందుకంటే భూమిపై ఉన్న మంచు నంతా కరిగించి గుంతను తవ్వాలి కదా. అందుకే అంత సమయం పడుతుందట. అందుకు వారు మంచుపై రెండు రోజుల పాటు మంట పెట్టి ఉంచుతారు. దీంతో మంచు కరుగుతుంది. అనంతరం గుంత తవ్వుతారు.
చివరిగా ఓయంయాకోన్ గ్రామం గురించిన మరో విషయం ఏమిటంటే… చలి కాలంలో అక్కడ పగలు కేవలం 3 గంటలు మాత్రమే ఉంటుంది, అదే వేసవి కాలంలోనైతే పగలు 21 గంటలు ఉంటుంది. కేవలం పశుపోషణ, చేపలు పట్టడం, వేట వంటి పనులు మాత్రమే అక్కడి ప్రజలు చేసుకుంటారు. అయితే ఈ మధ్య నుంచే ఆ గ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. దీంతో అలా గ్రామ వాసులకు ఆదాయం వస్తుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. తీవ్రమైన గడ్డ కట్టించే చలిని ఓసారి ఎంజాయ్ చేయాలనుకునే వారికి మాత్రం ఆ గ్రామం అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను అందించేందుకు రెడీగా ఉంది. ఇక ఎంజాయ్ చేయాలనుకునే వారు వెళ్లడమే తరువాయి..!