సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సమయంలో చనిపోక తప్పదు. కాకపోతే కొందరు ముందు, ఇంకొందరు వెనుక అంతే. హిందూ పురాణాల ప్రకారం యమధర్మరాజు ఆయువు ముగిసిన మనుషుల ప్రాణాలను తీసుకుని పోతాడని చెబుతారు. అయితే మనుషుల ప్రాణాలను తీసుకెళ్లడానికి, వారు చనిపోతానికి ముందే యముడు కొన్ని చావు సూచనలను పంపుతాడట. వాటిని ఎలా తెలుసుకోవచ్చో వివరించే ఓ కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పురాణ కాలంలో యమునా నది వద్ద అమృతుడనే వ్యక్తి నివసించే వాడు. కాగా ఒకానొక సందర్భంలో అతనికి చావు భయం పట్టుకుంటుంది. మృత్యువు ఎప్పుడు వస్తుందో, ఎలా తాను చనిపోతాడో తలచుకుని అతను భయపడేవాడు. దీంతో అతను యముడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఈ క్రమంలో యముడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడగ్గా అందుకు అమృతుడు తాను ఎప్పుడు చనిపోతాడో, అందుకు ముందు ఎలాంటి సూచనలు వస్తాయో తనకు తెలుపాలని కోరుతాడు. దీంతో తాను జాగ్రత్త పడి తన బాధ్యతలను అన్నింటినీ అందరికీ అప్పజెప్పవచ్చని అతని ఆలోచన. కాగా అమృతుడి కోరికను విన్న యముడు మరణం ఎప్పుడు వస్తుందో తాను చెప్పలేనని, కానీ అది వచ్చేందుకు ముందుగా కొన్ని సూచనలను పంపుతానని వాటిని తెలుసుకోవడం ద్వారా మరణం ఎప్పుడు వస్తుందో అతనే అంచనా వేసి తెలుసుకోవచ్చని యముడు అమృతుడికి వరం ఇచ్చి అంతర్థానమవుతాడు.
కాగా కొన్ని రోజులకు అమృతుడు పైన చెప్పిన సంఘటన గురించి పూర్తిగా మరిచిపోతాడు. అలా చాలా ఏళ్లు గడిచిపోతాయి. అదే క్రమంలో అమృతుడు పెళ్లి చేసుకోవడం, పిల్లలు కలగడం, వారు పెద్దగవడం, మళ్లీ వారికి పెళ్లిల్లు అవడం అన్నీ జరిగిపోతాయి. అయితే అమృతుడికి ఒక రోజు యముడితో జరిగిన ఆ సంఘటన గుర్తుకు వస్తుంది. కానీ తనకు ఇంకా అలాంటి సూచనలు ఏవీ అందకపోవడంతో తనకు ఇంకా ఆయువు ఉందనే అమృతుడు అనుకుంటాడు. కాగా ఒక రోజు అతని వెంట్రుకలు తెల్లబడిపోయి, చర్మమంతా తీవ్రంగా ముడతలు పడుతుంది. అయినా అమృతుడు తనకు ఇంకా ఆయువు తీరలేదనే అనుకుంటాడు. మరో రోజు పళ్లన్నీ ఊడిపోతాయి. అప్పుడు కూడా తనకు ఆయువు తీరలేదనే భావిస్తాడు. మరి కొంత కాలానికి అతనికి కళ్లు కనిపించకుండా పోతాయి. చివరిగా పక్షవాతం వచ్చి మంచంలో పడతాడు. ఆ రెండు సందర్భాల్లోనూ తనకు ఇంకా ఆయువు తీరలేదనే అనుకుంటాడు.
కాగా చివరికి ఒక రోజు యముడు వచ్చి అమృతుడికి ఆయువు తీరిందని, అతని ప్రాణాలను తీసుకుపోతానని అమృతుడికి చెబుతాడు. దీంతో ఆశ్చర్యపోయిన అమృతుడు తనకు చావు సూచనలు ఎలాంటివి అందలేదని, అయినా నువ్వు వచ్చి ప్రాణాలను తీసుకుపోతానంటున్నావు, అప్పుడు నీ వరం ఉట్టి మాటే కదా అని యమున్ని ప్రశ్నిస్తాడు. దీంతో యముడు 4 చావు సూచనలను నీకు ఇది వరకే తెలియజేశాను. అయినా నువ్వు గ్రహించలేదు. ఇప్పుడు నీ ప్రాణాలను తీసుకుపోవాల్సిందేనంటాడు. అప్పుడు అమృతుడు ఏంటా 4 సూచనలు అని అడగ్గా, యముడు అందుకు పైన కలిగిన 4 అనారోగ్యాల గురించి (వెంట్రుకలు తెల్లబడడం, పళ్లు ఊడిపోవడం, చూపు పోవడం, పక్షవాతం రావడం) అమృతుడికి వివరిస్తాడు. అప్పుడు అమృతుడు నిజమేనని ఒప్పుకోగా యముడు అతని ప్రాణాలను తీసుకెళ్తాడు. ఈ కథను బట్టి మనకు తెలిసిందేమిటంటే, మనకు కలిగే అనారోగ్యాలే మన మరణాన్ని నిర్దేశిస్తాయి. వాటి గురించి తెలుసుకుని జాగ్రత్త పడితేనే మన ఆరోగ్యం బాగుండి ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే మృత్యువు వాటి రూపంలోనే వస్తుందని తెలుస్తుంది.