Chiranjeevi : ఏపీలో ప్రస్తుతం సినిమా థియేటర్లలో టిక్కెట్ ధరల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై గత కొద్ది రోజులుగా కొందరు సెలబ్రిటీలకు, ఏపీ మంత్రులకు మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా నటుడు నాని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో మరొకసారి ఈ విషయం తెర మీదకు వచ్చింది.
ఏపీలో థియేటర్లను నడిపించడం కన్నా కిరాణా దుకాణం పెట్టుకోవడం మేలని నాని అన్నాడు. దీంతో స్పందించిన మంత్రులు నానిపై విమర్శలు చేశారు. హీరోలు భారీ ఎత్తున రెమ్యునరేషన్ తీసుకోకపోతే సినిమా తీసేందుకు ఖర్చులు తగ్గుతాయి కదా. ఆ రకంగా నష్టాలను తప్పించుకోవచ్చు కదా.. అంటూ కొందరు మంత్రులు కామెంట్లు చేశారు. అయితే ఈ సమయంలో టాలీవుడ్ అంతా మెగాస్టార్ చిరంజీవి వైపు చూస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే పలు మార్లు సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. సినీ ఇండస్ట్రీని ఆదుకోవాలని కోరారు. ఇక సమయం లభించినప్పుడల్లా ఆయన ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. ఏపీలో పాలన చక్కగా ఉందని, అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ జగన్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని.. ఇప్పటికే పలు మార్లు చిరంజీవి అన్నారు. అయితే అది వేరే.
ఎన్నిసార్లు పొగడ్తల వర్షం కురిపించినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం చిరంజీవి మాటలను పట్టించుకోనట్లుగా ఉంది. అందుకనే కాబోలు సినిమా థియేటర్లలో టిక్కెట్ల రేట్ల ధరలను భారీగా తగ్గించినట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అన్ని రంగాలకు గడ్డు కాలం నడుస్తున్నట్లుగానే సినీ రంగానికి కూడా ఉంది కనుక.. చిరంజీవి వెంటనే రంగంలోకి దిగి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తారని ఆశిస్తున్నారు.
ఇక ఏపీ ప్రభుత్వం మాత్రం టిక్కెట్ల ధరలను తగ్గించేలా కనిపించడం లేదు. హైదరాబాద్ నుంచి సినీ ఇండస్ట్రీని వైజాగ్‌కు తరలించకపోవడమే ఏపీ ప్రభుత్వ కోపానికి కారణమని కొందరు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే సీఎం జగన్‌ను కలుద్దామంటే ఇప్పటి వరకు ఆయన చిరంజీవికి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదట. ఆయన అపాయింట్‌మెంట్ లభించడం లేదని తెలుస్తోంది. మరి చిరంజీవి త్వరలో జగన్‌ను కలిసి సమస్యను పరిష్కరిస్తారా ? అన్నది చూడాలి. ఒక వేళ చిరంజీవి చొరవతో నిజంగానే సమస్య పరిష్కారం అయితే.. ఆయన టాలీవుడ్‌కు గాడ్ ఫాదర్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.