Toilet : మనం రోజూ తీసుకునే ఆహారాలు, తాగే ద్రవాలు మన శరీరంలో ఎప్పటికప్పుడు జీర్ణమవుతాయి. కొన్ని ఆహారాలు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కొన్నింటికి తక్కువ సమయం పడుతుంది. అయితే మన శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు మూడు రూపాల్లో బయటకు పోతాయి. ఒకటి చెమట, రెండు మూత్రం, మూడు మలం.
చెమట, మూత్రం, తరచూ మనకు వస్తూనే ఉంటాయి. అయితే చాలా మంది మల విసర్జన రోజుకు ఒక్కసారే చేస్తారు. కొందరు రోజుకు రెండు సార్లు వెళ్తుంటారు. ఇంకొందరికి ఎక్కువ సార్లు మల విసర్జన అవుతుంది. అయితే రోజుకు ఎన్ని సార్లు మల విసర్జన చేయడం ఆరోగ్యకరం ? మల విసర్జన ఎక్కువ చేస్తే ఖంగారు పడాలా ? అంటే..
రోజూ 2, 3 సార్లు మల విసర్జన చేయడం ఆరోగ్యకరమే. కానీ కొన్ని సార్లు అంతకన్నా ఎక్కువగా మల విసర్జన చేయాల్సి వస్తుంది. అయితే మల విసర్జన చేసినప్పుడు నీళ్లలా అవుతుంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి. అలాగే మలంలో రక్తం వచ్చినా, నలుపు రంగులో మలం ఉన్నా.. డాక్టర్‌ను కలవాలి. కొన్ని రకాల ఆహారాలను తీసుకున్నా.. మందులను మింగినా మలం నలుపు రంగులో వస్తుంది. కనుక కారణం అదే అయితే ఖంగారు పడాల్సిన పనిలేదు. అది కాకుండా ఇతర ఏవైనా కారణాలు ఉంటే మలం నల్లగా వస్తుంది కనుక.. డాక్టర్‌ను కచ్చితంగా కలవాలి.
కాబట్టి రోజుకు 2 నుంచి 3 సార్లు మల విసర్జన చేయడం ఆరోగ్యకరమే అని చెప్పవచ్చు. ఇక కొందరికి 2 రోజులైనా మల విసర్జన కాదు. అలాంటి వారు మలబద్దకంతో బాధపడుతున్నట్లు గుర్తించాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. లేదా ఇంటి చిట్కాలను పాటించాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల మల విసర్జన సులభంగా అవుతుంది. మలబద్దకం సమస్య ఉండదు.
బీట్‌రూట్, కీరదోస, క్యారెట్ వంటి కూరగాయలకు చెందిన జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. లేదా ఉదయం నాలుగైదు ఖర్జూరాలు లేదా అంజీర్ పండ్లను తింటున్నా.. ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.