ఈ రోజుల్లో మహిళలు.. మగవారితో సమానంగా ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఇంట్లోనూ, ఆఫీసుల్లో పనులు చక్కదిద్దుతూ.. శభాష్ అనిపించుకుంటున్నారు. అయితే, పెళ్లైయిన ప్రతి మహిళ గర్భం ధరించడం సహజమే. వర్కింగ్ మహిళలు ప్రెగ్నెన్సీలో ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని ఉద్యోగాల్లో రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాల్సి రావచ్చు.. మరికొన్ని పనుల్లో ఎక్కువ సమయం నిల్చొనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పనుల్లో బిజీగా ఉండి సరిగ్గా తినకపోవడం, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇవన్నీ బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయి. వర్కింగ్ మహిళలు, ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. పండంటి బిడ్డకు జన్మ ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పోషకాహారం కడుపులో బిడ్డ ఎదుగుదలకు కీలక పాత్ర పోషిస్తుంది. పనిలో పడి తిండి విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పోషక విలువలున్న కూరగాయలు, పండ్లు మీ డైట్‌లో ఎక్కువగా తీసుకోండి. ప్రోటీన్ అధికంగా ఉండే చిక్కుళ్ళు, మొలకలు, పాలు, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. స్నాక్స్‌గా సలాడ్స్, నట్స్ తీసుకోండి. నీరు ఎక్కువగా తాగండి, నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు సిప్ చేస్తూ ఉంటే.. హైడ్రెటెడ్‌గా ఉంటారు. మీ డైట్‌లో ఫోలెట్, ఐరన్, క్యాల్షియం రిచ్ పుడ్స్ ఉండేలా చూసుకోండి.
కడుపులోని బిడ్డకు రక్త ప్రసరణ మెరుగ్గా జరగడానికి.. రాత్రి పది గంటల నిద్ర అవసరం. గర్భిణి స్త్రీలు ప్రశాంతంగా నిద్రపోతే.. ఇన్ఫ్లమేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో తగినంత నిద్ర లేకపోవడం వల్ల నిరాశ, జస్టేషనల్ డయాబెటిస్, నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం, పిండం అభివృద్ధిలో బలహీనతకు దారితీస్తుంది. మీకు ఆఫీస్‌లో అలసటగా ఉంటే.. మధ్యాహ్నం పూట 15 నిమిషాలు నిద్రపోయినా మంచిదే. ఆఫీసు కుర్చీలో ఎక్కువ సేపు కూర్చోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో పాదాలలో నొప్పి, వాపు సమస్య ఉండవచ్చు. పని మధ్యలో లేచి.. కొద్ది సేపు ఆఫీస్ చూట్టూ నడిస్తే.. పాదాలు, కాళ్ల వాపులు, గడ్డకట్టడం, అనారోగ్య సిరలు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. భారీ వ్యాయామం, శ్రమతో కూడిన పని, ట్రైనింగ్‌కు దూరంగా ఉండండి. రాత్రి పూట నిద్రించే సమయంలో.. పాదాలను ఎత్తులో ఉంచండి.
ప్రెగ్నెన్సీ సమయంలో అతిగా పనిచేయడం, ఎక్కువగా అలసిపోవడం మంచిది కాదు. దీని కారణంగా ఒత్తడి, ఆందోళన పెరుగుతాయి. ఇది బిడ్డ ఎదుగుదలపై ఎఫెక్ట్ చూపుతుంది. వేళకు పనులన్నీ పూర్తయ్యేలా ఉదయమే చక్కటి ప్రణాళిక వేసుకుంటే సాయంత్రానికల్లా పనులన్నీ చకచకా పూర్తవుతాయి మీ షెడ్యూల్‌కు కట్టుబడి పనిచేసేలా ప్రయత్నించండి. పనికి మధ్యలో ఒత్తిడికి గురికాకుండా విశ్రాంతి తీసుకోవడం మంచిది. కూర్చున్నా, నిల్చున్నా శరీర భంగిమను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా పొట్టపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడచ్చు. గర్భధారణ సమయంలో మీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోవడం మంచిది కాదు. ఇది మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. ఊపిరి ఆడకపోవడానికి కూడా కారణం కావచ్చు. లూస్‌గా ఉండే.. కాటన్ బట్టలు వేసుకోండి.