దోమలు కుట్టడం వల్ల మనకు ఎలాంటి అనారోగ్యాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాలు ఎప్పుడు వద్దామా అని పొంచి ఉంటాయి. ప్రధానంగా సీజన్ మారే సమయంలోనైతే దోమల బెడద వర్ణనాతీతం. వర్షానికి కరెంట్ పోతే రాత్రి పూట ఇక దోమలు దాడి చేస్తాయి నా సామిరంగా, ఆ దెబ్బకు రాత్రంతా నిద్ర ఉండదు సరికదా మరుసటి రోజు తెల్లవారు జామున కూడా దాని ఎఫెక్ట్ అలాగే ఉంటుంది. కరెంట్ ఉంటే ఆలౌట్ వంటివి, లేకపోతే దోమల కాయిల్స్ పెట్టుకోవడం మనందరికీ అలవాటే. అయితే వాటితో మనకు కలిగే మేలు కన్నా మన ఆరోగ్యానికి హానే ఎక్కువగా జరుగుతుంది. ఈ క్రమంలో ఎలాంటి హాని లేకుండా సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన ఓ ద్రవం ద్వారా దోమలను ఎలా చంపవచ్చో ఇప్పుడు చూద్దాం.
కొద్దిగా నీటిని తీసుకుని వేడి చేసి చల్లార్చాలి. ఒక ప్లాస్టిక్ బాటిల్‌ను తీసుకుని దాన్ని రెండుగా కత్తిరించాలి. దాన్నుంచి కింది భాగం తీసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న నీటిని అందులో పోయాలి. ఆ నీటిలో కొద్దిగా చక్కెర, కొంచెం ఈస్ట్‌ను వేయాలి. ఈస్ట్ మనకు కిరాణా షాపుల్లో, సూపర్ మార్కెట్‌లలో దొరుకుతుంది. అనంతరం కొంచెం తేనెను ఆ మిశ్రమానికి కలపాలి. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్‌లో మిగిలిపోయిన రెండో ముక్కను (పైభాగాన్ని) రివర్స్ చేసి కింది భాగంలో పెట్టాలి. రెండు ప్లాస్టిక్ ముక్కలు కలిసే చోట గమ్‌ను రాయాలి. దీంతో అవి దృఢంగా ఉంటాయి.
ఇలా తయారైన ద్రవం నుంచి కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతూ ఉంటుంది. ఇది దోమలను ఆకర్షిస్తుంది. దీంతో దోమలు ఆ ద్రవం వద్దకు వచ్చి అందులో పడి చనిపోతాయి. ఇలా దోమలను విజయవంతంగా నిర్మూలించవచ్చు. దీన్ని గదిలో ఏదైనా ఒక ప్రదేశంలో పెడితే చాలు. అందులో ఉన్న దోమలన్నీ అక్కడికి వచ్చి చనిపోతాయి. అయితే ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే వస్తుంది. దోమలన్నీ ఆ బాటిల్‌లో నిండిపోయాక మళ్లీ ఇలాగే ద్రవాన్ని తయారు చేసుకుని బాటిల్స్‌ను కత్తిరించి పెడితే సరి. ఇక దోమలు మీ ఇంట్లో అస్సలే కనిపించవు.