ప్రస్తుత తరుణంలో టీనేజ్ వయస్సు వారికే కాదు ఎవరికి పడితే వారికి మొటిమలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వాటిని తగ్గించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ మార్కెట్‌లో దొరికే రకా రకాల క్రీములు రాయడం, బ్యూటీ పార్లర్‌లకు వెళ్లడం, లేజర్ ట్రీట్‌మెంట్ వంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే మొటిమలను సహజ సిద్ధమైన పద్ధతిలో దూరం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మొటిమలను తొలగించుకునేందుకు ఉపయోగపడుతుంది. ప్రతి రోజు రాత్రి పూట నిద్రపోయే ముందు కొద్దిగా నిమ్మరసాన్ని తీసుకుని ముఖానికి రాయాలి. ఉదయాన్నే నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే మొటిమలు త్వరగా పోతాయి.
మొటిమలను తగ్గించడంలో వెల్లుల్లి కూడా బాగానే పనిచేస్తుంది. రెండు వెల్లుల్లి రేకుల్ని తీసుకుని మొటిమలు ఏర్పడిన ప్రదేశంలో రాయాలి. 20 నిమిషాల పాటు వేచి ఉన్నాక ముఖాన్ని కడిగేయాలి. తరచూ ఈ టిప్‌ను పాటిస్తే మొటిమలను తగ్గించుకోవచ్చు. చర్మానికి సంరక్షణను కలగజేసే ఔషధగుణాలు అలోవెరా జెల్‌లో ఉన్నాయి. కొద్దిగా అలోవెరా జ్యూస్‌ను తీసుకుని ముఖానికి రాయాలి. కొద్ది సేపు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడమే కాదు, చర్మం కాంతివంతమై మృదుత్వాన్ని పొందుతుంది. మొటిమలను తగ్గించడంలో బేకింగ్ సోడా కూడా పనికొస్తుంది. కొంత బేకింగ్ సోడాకు కొన్ని చుక్కల నీటిని కలిపి ఆ మిశ్రమాన్ని నల్లని మచ్చలు, మొటిమలు ఉన్న ప్రదేశాల్లో రాయాలి. 10 నిమిషాలు ఆగాక ముఖాన్ని కడిగేసుకోవాలి. దీని వల్ల మొటిమలు తగ్గుతాయి.
చర్మ సంరక్షణకు వేపాకు బాగా పనికొస్తుంది. కొన్ని వేపాకులను తీసుకుని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 10 నిమిషాలు ఆగాక ముఖాన్ని కడిగేసుకోవాలి. దీంతో మొటిమలు తగ్గిపోతాయి. వేపాకులతో చేసిన విధంగానే తులసి ఆకుల నుంచి తీసిన రసాన్ని ముఖానికి రాసినా ఫలితం ఉంటుంది. కీరదోస ముక్కలు, ఐస్ క్యూబ్స్‌ను రాస్తూ ఉన్నా మొటిమలను తగ్గించుకోవచ్చు.