పప్పు చారులో నెయ్యి వేసుకోవడం, పెరుగన్నంలో అరటిపండు తినడం, అన్నంలో పాలు కలుపుకుని తినడం… ఏంటివన్నీ చెబుతున్నారు. మాకు వీటి గురించి తెలుసు కదా. వాటిని అలా కలుపుకుని తింటే ఆ మజాయే వేరుంటుంది అనబోతున్నారా? అయితే మీరు చెప్పేది కరెక్టే. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రం అలా దేంతో పడితే దాంతో కలిపి తినకూడదట. అలా తినడం వల్ల మనకు అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుందట. మరి అలాంటి రాంగ్ ఫుడ్ కాంబినేషన్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..?
కొబ్బరినీళ్లు, వాల్‌నట్స్, మాంసం, ఎగ్స్, పెరుగు, ఉలవలు, కందులు, పెసలు, బఠానీల వంటి పప్పు ధాన్యాలు, కూరగాయలతో పాలను కలిపి తీసుకోకూడదట. లేదంటే జీర్ణక్రియలో ఉపయోగపడే ఎంజైమ్‌ల పనితీరు మందగిస్తుందట. ముల్లంగి, వెల్లుల్లి, ఆకుపచ్చని కూరగాయలు, మునగ కాయలు తదితరాలు తిన్న తరువాత అసలు పాలు తాగకూడదట. ఇతర ఏ ఆహార పదార్థాలతోనూ పండ్లను తీసుకోకూడదు. వేరే ఆహారాన్ని తీసుకోవడానికి కొంత సేపటి ముందో, తరువాతో పండ్లను తినాలి. లేదంటే పండ్లలోని పోషకాలు మనకు సరిగా అందవు. అంతేకాదు జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. తీయగా ఎంతో రుచిగా ఉండే తేనె అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే తేనెను ఎప్పుడు తీసుకున్నా డైరెక్ట్‌గానే తీసుకోవాలి. వేడి చేయకూడదు. ఒక వేళ తేనెను వేడి చేస్తే అందులోని పోషకాలు విష పదార్థాలుగా మారేందుకు అవకాశం ఉంటుందట.
పాలు, పెరుగు, కీరదోస, టమాటాలు వంటి వాటితో నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోకూడదు. లేదంటే కడుపులో అసిడిటీ ఎక్కువైపోయి గ్యాస్ సమస్యలు వస్తాయి. చికెన్, పోర్క్ మాంసాలను ఒకేసారి తినకూడదట. అంతేకాదు, ఈ రెండింటినీ ఒకే రోజు తినకూడదు. పెరుగును వేడి చేయకుండానే తినాలి. ఒకవేళ వేడి చేసి తింటే అది జీర్ణాశయ సంబంధ సమస్యలను తెచ్చి పెడుతుంది. మినుములు, తేనె, ముల్లంగి, మొలకెత్తిన గింజలను ఎలాంటి మాంసాహారంతోనూ కలిపి తినకూడదు. మినుములతో ముల్లంగి, పనస పండ్లను కలిపి తినకూడదు.
మజ్జిగ-అరటిపండు, పెరుగు-ఖర్జూరాలు, నల్ల మిరియాలు-చేపలు, పాలు-మద్యం కాంబినేషన్‌లలో ఫుడ్ తినకూడదు. ఇత్తడి లేదా ప్లాస్టిక్‌తో తయారు చేసిన పాత్రలు, బాటిల్స్‌లో 10 రోజులకు పైగా నిల్వ ఉంచిన నెయ్యిని అసలు తినకూడదు. ఎందుకంటే అలాంటి నెయ్యిలో విషపదార్థాలు తయారవుతాయి. నువ్వుల పేస్ట్, పాలకూరలను కలిపి తయారు చేసిన ఆహారాన్ని తినకూడదు. ఎందుకంటే ఆ ఆహారాన్ని తింటే డయేరియా వస్తుంది. ఉడికించిన ఆహారాన్ని ఉడకని ఆహారంతో కలిపి తీసుకోకూడదు. లేదంటే ఆ రెండింటితో జీర్ణక్రియ సరిగ్గా జరగక గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి.