ఎండాకాలం అంటేనే ఉక్కపోత. వేడి..! దాన్ని తట్టుకోలేక చాలా మంది అవస్థలు పడుతుంటారు. అది సరే. మరి ఈ సీజన్‌లో తీసుకునే ఆహారం మాటేమిటి..? చాలా మంది అయితే చల్లని పదార్థాలను తీసుకోవడంపై దృష్టి పెడతారు. దీంతో శరీరం చల్లగా ఉంటుందని, వేడిని తరిమికొట్టి శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చని అందరూ భావిస్తారు. అది కరెక్టే. కానీ… వేసవిలో కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రం తినకూడదు. ఎందుకంటే ఎండల్లో కొన్ని ఆహార పదార్థాలు మన శరీరానికి చల్లదనాన్ని ఎలా అయితే ఇస్తాయో అలాగే కొన్ని ఆహారాలు వేడిని కలిగిస్తాయి. కనుక అలా వేడి కలిగించే ఆహారాల జోలికి వెళ్లకూడదు. వెళ్తే ఏమవుతుందో, ఎలాంటి పదార్థాలను వేసవిలో తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణ సమయాల్లో ఏమో కానీ, వేసవిలో మాత్రం మసాలాలు, కారం ఉన్న ఆహారాన్ని అస్సలు తినకూడదు. ఎందుకంటే అవి శరీరంలో వేడిని అమితంగా పెంచేస్తాయి. దీంతో జీర్ణాశయం ఇర్రిటేషన్‌కు గురవుతుంది. ఫలితంగా అది డయేరియాకు దారి తీస్తుంది. కనుక మసాలాలు, కారం అధికంగా ఉన్న ఆహారాన్ని వేసవిలో తినరాదు. చికెన్, మటన్, ఫిష్… ఇలా మాంసాహారం ఏదైనా వేసవిలో తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ ఆహారాలు కూడా శరీర వేడిని పెంచుతాయి. ఫలితంగా చెమట అధికంగా వస్తుంది. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. విరేచనాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. నూనె బాగా దట్టించి వండిన వంటకాలను అస్సలు తినరాదు. ఇవి కూడా శరీర వేడిని పెంచుతాయి. అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. గ్యాస్ వస్తుంది. డయేరియా సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది.
రోజుకు ఒకటి, రెండు కప్పుల కన్నా ఎక్కువ మోతాదులో టీ, కాఫీలను వేసవిలో తాగకూడదు. అలా తాగితే ఒంట్లో వేడి పెరుగుతుంది. తద్వారా అధికంగా చెమటలు వస్తాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. టమాటా, చిల్లీ సాస్ లను కూడా వేసవిలో అస్సలు తినరాదు. తింటే శరీరంలో అధికంగా వేడి పెరుగుతుంది. ఫలితంగా జీర్ణాశయం ఇర్రిటేషన్‌కు గురై విరేచనాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది.