Omicron : ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న విషయం విదితమే. ఒమిక్రాన్ రూపంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. సౌతాఫ్రికాలో మొదట ఈ వేరియెంట్ బయట పడగా.. ఇప్పుడిది 200కు పైగా ప్రపంచ దేశాల్లో ప్రభావం చూపిస్తోంది. మన దేశంలోనూ రోజు రోజుకీ ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
అయితే గతంలో కరోనా బారిన పడి కోలుకున్న వారితోపాటు తాజాగా ఒమిక్రాన్ బారిన పడి కోలుకున్న వారికి తిరిగి ఒమిక్రాన్ రీ ఇన్‌ఫెక్షన్ అవుతుందా ? మళ్లీ వారికి ఒమిక్రాన్ వస్తుందా ? అంటే.. అందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అవుననే సమాధానం చెప్పింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. గతంలో కోవిడ్ వచ్చి తగ్గిన వారితోపాటు తాజాగా ఒమిక్రాన్ బారిన పడి కోలుకున్న వారికి తిరిగి ఒమిక్రాన్ వ్యాప్తి చెందే అవకాశాలు 4, 5 రెట్లు ఎక్కువగానే ఉంటాయని, గత కరోనా వేరియెంట్ డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని వెల్లడంచింది. అందువల్ల కోవిడ్ వచ్చి రికవరీ అయిన వారు, వ్యాక్సిన్ తీసుకోని వారు, తీసుకున్న వారు.. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందేనని సూచించింది.
ఇక ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ డెల్టా వేరియెంట్‌లా పెద్ద సీరియస్ అవడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. అలాగే 20-30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి ఒమిక్రాన్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని.. ముఖ్యంగా పనిచేసే ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ తిరిగే వారికే ఒమిక్రాన్ ఎక్కువగా వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.