శక్తివంతమైన ఆలయాలకు, చరిత్రకు నెలవు మన దేశం. ఇక్కడ ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో గుడిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒకే రోజులు అమ్మావారు బాలికగా, యువతిగా, వృద్ధురాలిగా కనిపిస్తుంది. ఈ విశిష్టమైన దేవాలయంలో అన్నీ అంతుచిక్కని రహస్యాలే ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రతిరోజూ జరిగే అద్భుతాన్ని చూసి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఉత్తరాఖండ్ వాసులకు ఆరాధ్య దేవత ధారీదేవి. కాళీమాతకు మరో రూపమైన ధారీదేవి చార్ ధామ్ క్షేత్రాలకు నాయక అని చెబుతారు. బద్రీనాథ్‌కు శ్రీనగర్‌కు వెళ్లే దారిలో కల్యాసౌర్ గ్రామంలో అలకనంద నది ఒడ్డున ఈ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయం అలకనందా నదీ ప్రవాహాన్ని నియంత్రిస్తుందని అక్కడి వారి విశ్వాసం.
ఈ ఆలయం గురించి మహాభారతంలో ప్రస్తావించారు. సిద్ధపీఠం పేరుతో భాగవతంలో పేర్కొన్నారు. 108 శక్తి పీఠాల్లో ధారీదేవి ఆలయం కూడా ఒకటని దేవీ భాగవతంలో ఉంది. ఆదిశక్తి ఉగ్ర అంశం మహాకాళి అవతారమే ధారీదేవి. భక్తితో కొలిచినవారిని అనుగ్రహించే దేవత అయిన ధారాదేవిని ధిక్కరిస్తే అంతే కీడు జరుగుతుందని ప్రజలు బలంగా నమ్ముతారు. క్రీ.శ 1882లో కేదారీనాథ్ ప్రాంతాన్ని ఓ రాజు పడగొట్టాలని ప్రయత్నించాడు. ఆ టైంలోనే కొండ చరియలు విరిగిపడి కేదారనాథ్ ప్రాంతం నేలమట్టమైపోయిందని స్థానికులు చెబుతారు. ఆ ప్రకృతి విపత్తు వేల మందిని బలితీసుకుందని కూడా ప్రచారంలో ఉంది. దీన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ రాజు తన ప్రయత్నాన్ని విరమించుకుని పారిపోయాడంట. అప్పటి నుంచి ఈ ఆలయం జోలికి వెళితే ధారీదేవి ఆగ్రహం చవిచూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది.
2013 మే నెలలో వచ్చిన ఉత్తరాఖండ్ వరదలకు కూడా ఈ దేవి ఆలయాన్ని తొలగించడమే ప్రధాన కారణం అని చెబుతారు. శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి సమీపంలో కొండపై ప్రతిష్ఠించింది. ఆ మరుసటి రోజే కుంభవృష్టి కురిసి అలకనంద మహోగ్రరూపం దాల్చి విలయ తాండవం చేసింది. అలకనంద ఉగ్రరూపంలో దాదాపు 10 వేలమంది మృత్యువాతపడ్డారు. ఆ తర్వాత మళ్లీ విగ్రహాన్ని అదే స్థానంలో ప్రతిష్టించారు. గర్వాల్ ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ఉన్న ఈ ధారాదేవి ఆలయం గర్భగుడిలో అమ్మవారు సగభాగం మాత్రమే ఉంటుంది. మిగతా భాగం కాళీమఠ్‌లో ఉందని చెబుతారు. కాళీమఠ్‌లో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ స్త్రీ యంత్రం అమ్మవారి యోనికి ప్రతిరూపంగా ఉంటుంది.
ఈ పీఠానికి ఉత్తరదిశలో కేథారనాథ్ జ్యోతిర్లింగం ఉంది. ఈ ఉత్తరదిక్కుకి అధిపతి బుధుడు. బుధుడు అహింసను ప్రభోదిస్తాడు. ఫలితంగా ఉత్తరదిక్కు నుంచి వచ్చే శాంతి ప్రభావం వల్ల ఆగ్నేయ దిశలో ఉండే కాళీమాత శాంతిస్తుందిని చెబుతారు. ఆలయంలో అమ్మవారు ఉదయం బాలికగా, మధ్యాహ్నం నడి వయసు మహిళగా, సాయంత్రం వృద్ధురాలిగా మారుతుంది. అమ్మవారి శక్తి ఎలా ఉంటుందో ఇంతకన్నా ఏం చెప్పగలం.