ఇంట్లో ఉన్నప్పుడు మనం వీలైనంత వరకు కుళాయి నీళ్లో లేదంటే వాటర్ ఫిల్టర్‌లో ఫిల్టర్ చేయబడిన నీళ్లనో తాగుతాం. కానీ బయటకు వెళ్తే మాత్రం మినరల్ వాటర్ బాటిల్సే గతి. వాటిని కాదని ఎక్కడ పడితే అక్కడ నీళ్లను తాగేందుకు మనం ధైర్యం చేయం. ఏవైనా ఇన్‌ఫెక్షన్లు సోకుతాయని, రోగాలు వస్తాయని మనకు భయం. అందుకే మనం బయట వీలైనంత వరకు మినరల్ వాటర్ బాటిల్స్‌లోని నీటికే ప్రాధాన్యతను ఇస్తాం. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే విషయం తెలిస్తే మాత్రం ఇకపై మీరు బయట ఎక్కడైనా, ఎప్పుడైనా మినరల్ వాటర్ బాటిల్స్‌లోని నీటిని తాగేందుకు భయపడుతారు. అవును, మీరు విన్నది నిజమే. విషయం అలాంటిది మరి. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే…
న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు ఓ పరిశోధన చేశారు. వారు జర్నలిజం ప్రాజెక్ట్ ఆర్బ్ మీడియా అనే సంస్థ సూచన మేరకు ఆ పరిశోధన చేపట్టారు. అమెరికా, చైనా, ఇండియా, బ్రెజిల్, ఇండోనేషియా, కెన్యా తదితర మొత్తం 9 దేశాల్లో చెలామణీలో ఉన్న 11 బ్రాండ్లకు చెందిన 259 మినరల్ వాటర్ బాటిల్స్‌లోని నీటిని పరిశీలించారు. ఈ పరిశీలనలో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. అదేమిటంటే…
సదరు 259 వాటర్ బాటిల్స్‌లో 90 శాతం వాటిలో ఉన్న నీటిలో ప్లాస్టిక్ అవశేషాలు, రేణువులు ఎక్కువగా ఉన్నాయట. 17 బాటిల్స్‌లోని నీటిలో మాత్రమే ఎలాంటి ప్లాస్టిక్ రేణువులు, అవశేషాలు లేవని వారు గుర్తించారు. ఇక ప్లాస్టిక్ అవశేషాలు ఉన్న వాటర్ బాటిల్స్ ఒక్కో దాంట్లో గరిష్టంగా 10వేల వరకు ప్లాస్టిక్ కణాలు ఉన్నాయని గుర్తించారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంటే మనం తరచూ తాగే మినరల్ వాటర్ బాటిల్స్‌లోని నీటిలో అన్ని ప్లాస్టిక్ కణాలు ఉంటున్నాయమాట. నిజంగా ఇది షాకింగ్ విషయమే కదా. ఇక అలాంటి ప్లాస్టిక్ బాటిల్స్‌లోని నీరు మనం రోజూ తాగే కుళాయి నీటి కన్నా ఎక్కువ హానికరమైందని సదరు సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో మరోసారి మినరల్ వాటర్ బాటిల్స్‌లో ఉండే నీటి పట్ల అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) త్వరలోనే ఈ బాటిల్స్‌లో ఉండే నీరు, వాటి వల్ల కలిగే అనారోగ్యాలపై పరిశోధనలు చేస్తామని చెప్పింది. ఏది ఏమైనా.. ఇప్పుడు జనాలు మాత్రం ఇకపై బయట దొరికే మినరల్ వాటర్ బాటిల్స్‌లో నీరు తాగాలంటే మాత్రం కచ్చితంగా జంకుతారు. చివరకు ఇది ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.