ఎవరికీ చెడు చెయని సినిమా! ఒక్క పాటలో cement అనే పదం తప్ప ఎక్కడా ఇంగ్లీష్ పదం ఉండదు. ఒక బాగా బతికి తర్వాత చితికిపొయిన ఒక కుటుంబం. బాగా ఉన్న కుటుంబంలో ఉన్న మనస్తత్వ చిత్రణ. ఈ కథలో ఉన్నవి పశ్చిమ గోదావరి జిల్లాలో రేలంగి అనే చిన్న పల్లెటూరు, కృష్ణా జిల్లా విజయవాడ నేపథ్యం ఉన్న పాత్రలు కాబట్టి ఆయా ప్రాంతాల యాస కనిపిస్తుంది. ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు బాగుండటం అంటే బాగా ఉండటం కాదు నలుగురితో ఉండటం, నవ్వుతూ ఉండటంఇదే రేలంగి మావయ్య పాత్ర చెబుతుంది. ఆయన లాగా స్వఛ్ఛంగా నవ్వడం చేతకాక వెంకటేశ్ ఉద్యోగం పోతుంది. మహేష్ కి తన ఇంటర్వ్యూ కూడా పోతుంది.
మన రోజూ చూసే పాత్రలు, ఎదురయ్యే సవాళ్లు చూపించారు. పోల్చుకోగలిగేలా ఉంటుంది. మన కుటుంబంలో కూడా ఒక బామ్మ ఉంటుంది దెప్పి పోడుస్తూనే ప్రేమ చూపిస్తుంది, ఒక కొంటె తమ్ముడు ఉంటాడు, ఒక లౌక్యం తెలియని అన్న, ఆస్తితో పని ఏముంది అందరం బాగున్నాం ఏం పని చేసిన మంచి చేయాలి, జరిగిన దానిలో మంచి చూడాలి అని చెప్పే తల్లితండ్రులు ఉంటారు, మన కోసం మన ఇంట్లోనే పుట్టిన మరదలు, అలాగే మనకి బొత్తిగా కిట్టని బంధువుల్లో మన కోసం పడి చచ్చే అమ్మాయ్ ఉండవచ్చు.
ఒక సందర్భంలో మహేష్ అందరం ఒక మాట మీద ఉండాలి కదా అంటాడు.. ఇది అన్ని మధ్యతరగతి వారు అంటుండే మాట.. దాని అర్ధం మనం కలిసి ఒకే మాట మీద ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు అని. (collective decision making). నిజానికి మనమో , మన కుటుంబంలో ఎవరో ఒకరికి, ఎదో ఒక పరిస్థితిలో ఖాళీ గా ఉండి ఉంటాం.. ఎవరన్నా బాబు ఇప్పుడేం చేస్తూన్నవ్ అంటే మనకి కూడా కాలి ఇంకెప్పుడూ ఎక్కడికీ రాను అని చెప్పి ఉంటాం. ఇలాంటి నిజ జీవిత సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి.