సాధారణంగా హిందు వివాహ సాంప్రదాయంలో వివాహ సమయంలో దంపతుల చేత ఏడు అడుగులు వేయిస్తారు. హోమం చుట్టూ వేసే ఆ ఏడు అడుగులనే సప్తపది అంటారు. సప్తపదిలో వేసే ప్రతి అడుగుకు ఒక్కో అర్థముందంటారు మన పెద్దలు. ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ సాంప్రదాయంలో వివాహ సమయంలో జరిగే వివిధ క్రతువులకు ప్రత్యేకమైన అర్ధం, పరమార్ధం ఉంది. అపరిచితులైన ఇద్దరు వ్యక్తులను మంత్రబద్ధంగా ఒకటిగా చేస్తుంది వివాహం. పెండ్లి కుమారుడు కళ్యాణమండపానికి వచ్చిన తర్వాత కళ్యాణ దీక్షా కంకణం కడతారు పురోహితులు. అమ్మాయి తల్లితండ్రులు వరునికి కాళ్లు కడిగి , తమ కన్నబిడ్డను ధర్మార్ధ, కామ, మోక్షాలలో తోడుగా ఉంటానని ప్రమాణం చేయించి కన్యాదానం చేస్తారు. వివాహ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టి , పిమ్మట మాంగల్యధారణ జరుగుతుంది.
వివాహ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వధువరుల కొంగు ముడులు కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికిన వేలును వరుడు పట్టుకునీ అగ్ని హోత్రం చుట్టూ ప్రదక్షణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్నీ సప్తపది అంటారు. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. పూరోహితుడు వధూవరులిద్దరిని అగ్నిసాక్షిగా జీవితాంతం ఒక్కటిగా కలిసి మెలిసి ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటామనే ప్రమాణాలు చేయిస్తాడు.
సప్తపది అంటే ఏడడుగులు కలిసి నడవడం. ఇద్దరూ కలిసి ఏడడుగులు నడిస్తే మిత్రబంధం ఏర్పడుతుందని భావం. అందుకే పెద్దలు వివాహబంధం ఏడడుగుల బంధం అని అంటారు.