కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆర్‌టీసీని మరింత బలోపేతం చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇక ఇందులో భాగంగా త్వరలో ఆర్టీసీలో కొత్త బస్సులను అందుబాటులోకి తేనున్నారు. మొత్తం 422 కొత్త బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఈ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. 294 పల్లె వెలుగు, 88 మెట్రో డీలక్స్, 17 ఎక్స్‌ప్రెస్, 22 డీలక్స్ బస్‌లను అందుబాటులోకి తెస్తారు. ఆర్‌టీసీ పటిష్టత కోసం అనేక చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
ఏళ్లకు ఏళ్ల పాటు ఆర్‌టీసీలో ఉన్న డొక్కు బస్సులను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే 15 ఏళ్ల కాలం దాటిన బస్సులను లేదా 15 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను పక్కన పెట్టనున్నట్లు తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పిస్తున్న విషయం విదితమే. ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఈ పథకాన్ని ఆపేది లేదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో కొత్త బస్సుల రాకతో ప్రయాణికులకు మరింత భద్రత లభించనుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్‌టీసీ చార్జిల పెంపు విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.