ఇప్పటి వరకు మనం రామాయణాన్ని, అందులో జరిగిన పలు సంఘటనలు, ఎన్నో విశేషాల గురించి తెలుసుకున్నాం. కానీ ఎంత తెలుసుకున్నా అందులో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా దాదాపుగా అలాంటిదే. అయితే ఇది కొత్త విషయం కాకపోయినా దీని గురించి చాలా మందికి తెలిసి ఉండదు. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే… రావణుడు లంకకు అధిపతి, అలాగే అతని వద్ద పుష్పక విమానం ఉంటుంది. అందులోనే కదా సీతను ఎత్తుకెళ్లింది. అయితే నిజానికి రావణుడు పాలించిన లంకతోపాటు అతని వద్ద ఉన్న పుష్పక విమానం కూడా అతనివి కావు. అవి వేరే వ్యక్తికి చెందినవి. అయితే ఆ వ్యక్తి ఎవరంటే..?
మీకు కుబేరుడు తెలుసు కదా..! సంపదలను సృష్టించే లక్ష్మీ దేవి నుంచి దాన్ని తీసుకుని లోకంలో ఉన్న అందరికీ సంపదలను పంచే వ్యక్తి అతను. అయితే నిజానికి కుబేరుడు రావణుడికి అన్న అవుతాడు. ఎలా అంటే… విశ్వశ్రవుడనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య వరవర్ణిని. రెండో భార్య కైకసి. మొదటి భార్యకు పుట్టిన వాడే కుబేరుడు. రెండో ఆమెకు రావణుడు, కుంభకర్ణుడు, శూర్ఫనఖ, విభీషణుడు జన్మిస్తారు. అయితే కుబేరుడు పుట్టకతోనే మరుగుజ్జుగా పుడతాడు. పెద్ద పొట్ట ఉంటుంది. మూడు కాళ్లు ఉంటాయి. శరీరం అస్తవ్యస్తంగా నిర్మాణమై ఉంటుంది. దంతాలు బయటికి వస్తాయి. అయినప్పటికీ లోకంలో సంపదను పంచే దేవుడిగా ఉండడంతో అతనికి ఓ నగరం, ఓ వాహనం అవసరం అని చెప్పి విష్ణువు ప్రముఖ శిల్పి విశ్వకర్మతో లంకా నగరాన్ని, పుష్పక విమానాన్ని తయారు చేయించి కుబేరుడికి ఇస్తాడు. అప్పుడు కుబేరుడు లంకు రాజుగా ఏలుతుంటాడు. అదే సమయంలో రావణుడు, కుంభ కర్ణుడు వనాలకు వెళ్లి తీవ్రంగా తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఆయనచే ఎన్నో వరాలను పొందుతారు. తమకు అంత సులభంగా చావు రాకూడదని చెప్పి వరాలు తీసుకుంటారు.
అయితే బ్రహ్మ ఇచ్చిన వరాల కారణంగా రావణుడు, కుంభ కర్ణుల వల్ల దేవతలందరికీ ప్రమాదం పొంచుకు వస్తుంది. అన్ని లోకాలను వారు ఆక్రమించుకుంటూ ఉంటారు. ఆ క్రమంలోనే కుబేరుడు రాజుగా ఉన్న లంకా నగరాన్ని కూడా రావణుడు కైవసం చేసుకుంటాడు. దాంతోపాటే పుష్పక విమానాన్ని కూడా లాక్కుంటాడు. అప్పుడు కొన్నేళ్ల పాటు రావణుడు అలా లంకను ఏలాక, రాముడి చేతిలో మరణిస్తాడు. దాంతో రాముడు ఆ పుష్పక విమానాన్ని రావణుడి తమ్ముడు అయిన విభీషణుడికి అప్పగిస్తాడు. అలా అది చివరకు విభీషణుడి వద్దకు చేరుతుంది. అయితే యుద్ధం ముగిసి అంతా సర్దుకున్నాక రాముడు అయోధ్యకు వెళ్లే క్రమంలో తన తోటి పరివారాన్ని అంతటినీ అదే పుష్పక విమానంలో ఎక్కించుకుని తీసుకెళ్తాడు. అనంతరం పుష్పక విమానం మళ్లీ లంకలో విభీషణుడి వద్దకు చేరుకుంటుంది. ఒక పెద్ద నగరానికి చెందిన ప్రజలు మొత్తం ప్రయాణించేందుకు వీలుగా పుష్పక విమానాన్ని విశ్వకర్మ తయారు చేశాడట. అందుకే రాముడు, అతని పరివారం మొత్తం అందులో అయోధ్యకు చేరుకుంటుంది..! అయితే లంకా నగరం, పుష్పక విమానం పోయేసరికి కుబేరుడికి శివుడు వేరే బాధ్యతలను అప్పగిస్తాడట. అతన్ని ఉత్తర దిక్కుకు అధిపతిగా చేస్తాడట. అందుకే ఉత్తర దిక్కు అంటే ఇప్పటికీ ధనం, సంపదకు నిలయమని చెబుతుంటారు.