ఈ భూప్రపంచంలో అనేక వేల వృక్ష జాతులు ఉన్నాయి. అయితే వాటిలో కేవలం కొన్నింటిని మాత్రమే దేవతా వృక్షాలుగా హిందువులు కొలుస్తారు. వాటిని పవిత్ర వృక్షాలుగా పేర్కొంటూ ఎప్పటి నుంచో మన పూర్వీకులు వాటికి పూజలు కూడా చేస్తున్నారు. అలాంటి వాటిలో చెప్పుకోదగిన వృక్షం అశోక. అశోక చెట్టు గురించిన వర్ణనలు పురాణాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. నిజానికి అశోక అనేది సంస్కృత పదం. అశోక అనే పదానికి అర్థమేమిటంటే బాధలు కలిగించనిది, దుఃఖాలను దూరం చేసేది అని అర్థాలు వస్తాయి. అందుకే ఈ వృక్షాన్ని ఒకప్పుడు మన పూర్వీకులు పూజించే వారు. అయితే దీన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఉన్న అశోక చెట్టుకు రోజూ మహిళలు నీరు పోయాలి. దీని వల్ల వారు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు వారికి రుతుక్రమ సమస్యలు కూడా ఉండవట. ఇంట్లో అశోక చెట్టును ఉత్తరం దిశగా పెట్టుకోవాలి. దీంతో ఇంట్లోకి పాజిటివ్ శక్తి ప్రసారమవుతుంది. అది అనేక శుభాలను కలిగిస్తుంది. అయితే ఆ చెట్టుకు మాత్రం రోజూ నీటిని పోయాలి. పెళ్లయిన దంపతులు అశోక చెట్టు వేళ్లను దిండు కింద పెట్టుకుని రోజూ నిద్రించాలి. దీంతో వారికి ఉండే వైవాహిక సమస్యలు, ఇతర సమస్యలన్నీ తొలగిపోతాయి.
అశోక చెట్టు వేళ్లను తాజా మంచి నీటితో శుభ్రంగా కడిగి వాటిని పూజ గదిలో పెట్టుకుంటే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయట. అశోక చెట్టు కింద రోజూ నెయ్యి, కర్పూరంతో దీపాన్ని వెలిగించాలి. దీంతో ఆ ఇంట్లోని వారందరికీ అంతా మంచే జరుగుతుంది. వారికి ఎల్లప్పుడూ అదృష్టం వెన్నంటి ఉంటుంది. అశోక చెట్టు ఆకులు సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉన్నాయి. వాటిని రసంగా చేసి కొంత మోతాదులో గనక తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమవుతాయి. జ్వరం కూడా తగ్గుతుంది.