శివాభిషేకం అంటే చాలు అందరికి సాధ్యమయ్యే ప్రక్రియే. అంతేకాదు అన్నింటికి సర్వరోగనివారిణి, సర్వకార్య ఫలప్రదాయణిగా ప్రసిద్ధి. ఎవ్వరికీ ఏ కష్టమొచ్చినా చేయించుకోవాల్సింది శివాభిషేకమే. అటువంటి శివాభిషేకంలో ఆయా కామ్యాలను తీర్చుకోవడానికి ఆయా పదార్థాలను వాడాలని శాస్త్ర వచనం. ఏ పదార్థం వాడితే ఏం ఫలమో తెలుసుకుందాం…
శివానుగ్రహం పొందాలంటే శుభ్రమైన జలంతో అభిషేకించాలి. ఆవుపాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో శివుడిని అభిషేకిస్తే ఆరోగ్యం, బలం, యశస్సు సిద్ధిస్తాయి. ఆవు నెయ్యితో అభిషేకం వల్ల ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. తేనెతో అభిషేకం చేస్తే తేజోవృద్ధి చెందుతారు. చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనం వృద్ధి చెందుతుంది. మెత్తని చక్కెరతో అభిషేకం చేస్తే దుఃఖం నాశనం అవుతుంది. సంతోషంగా ఉంటారు. ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేస్తే కార్యజయం కలుగుతుంది. జ్ఞానప్రాప్తి సిద్ధిస్తుంది. మామిడి పండ్ల రసంతో శివుడిని అభిషేకిస్తే దీర్ఘకాలంగా ఉన్న వ్యాధులు తగ్గుతాయి. నేరేడు పండ్లతో అభిషేకం చేస్తే వైరాగ్యం సిద్ధిస్తుంది. ఖర్జూర రస జలంతో అభిషేకం చేస్తే సకల కార్యాల్లోనూ జయం కలుగుతుంది.
కొబ్బరి నీటితో శివుడిని అభిషేకిస్తే సర్వసంపదలు వృద్ధి చెందుతాయి. భస్మ జలంతో అభిషేకం చేస్తే మహాపాపాలు కూడా నాశనమైపోతాయి. బిల్వ దళాలను ఉంచిన నీటితో అభిషేకం చేస్తే భోగ భాగ్యాలు సిద్ధిస్తాయి. దుర్వోదకంతో అయితే నష్ట ద్రవ్య ప్రాప్తి కలుగుతుంది. రుద్రాక్షోదకంతో అయితే మహాదైశ్వర్యం కలుగుతుంది. పుష్పోదకంతో అయితే భూలాభం కలుగుతుంది. సువర్ణోదకంతో అయితే దారిద్ర్యం నాశనం అవుతుంది. నవరత్నోదకంతో అయితే ధాన్యం, గృహం కలుగుతాయి. హరిద్రోదకంతో అయితే సౌభాగ్యం కలుగుతుంది. మంగళప్రదంగా ఉంటుంది.
గంధోదకం (పన్నీరు)తో అభిషేకం చేస్తే పుత్రలాభం కలుగుతుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు భయనివారణ అవుతుంది. తిలమిశ్రిత ఆవుపాలతో అభిషేకం చేస్తే శనిగ్రహపీడ నివారణ అవుతుంది. శర్కరమిళిత ఆవుపాలతో అభిషేకం చేస్తే జడబుద్ధి నివృత్తి, వాక్‌శుద్ధి, వాక్సిద్ధి అవుతాయి. దక్షిణావృత శంఖోదక జలంతో అభిషేకం చేస్తే కలహాలు ఉండవు. కస్తూరీజలాలతో శివుడిని అభిషేకిస్తే గృహకల్లోలాలు తొలగిపోతాయి. ఇలా భిన్న రకాల పదార్థాలతో శివున్ని అభిషేకించడం వల్ల భిన్న ఫలితాలను పొందవచ్చు.