సూర్య, చంద్ర గ్రహణాలనేవి సహజంగా ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అయితే కొన్ని సార్లు గ్రహణం పాక్షికంగా అంటే.. కొద్దిగా మాత్రమే ఉంటుంది. కొన్ని సార్లయితే గ్రహణం సంపూర్ణంగా ఉంటుంది. ఈ క్రమంలో అసలు ఎలాంటి గ్రహణం అయినప్పటికీ దేవాలయాలను మూసే సాంప్రదాయం ఆచరణలో ఉంది. గ్రహణం పట్టడానికి ముందే ఆలయాలను మూసేస్తారు. మళ్లీ గ్రహణం విడిచిన తరువాతే ఆలయాలను తెరుస్తారు. అనంతరం ఆలయంలో పూజలు, శుద్ధి కార్యక్రమాలు చేశాకే మళ్లీ భక్తులకు అనుమతినిస్తారు. అయితే అసలు గ్రహణం పట్టడానికి, అదే సమయంలో ఆలయాలను మూసేయడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
అమృతం కోసం పాల సముద్రాన్ని దేవతలూ, రాక్షసులూ మధిస్తారు. బోలెడు తిప్పలు పడ్డాక, బోలెడు సంఘటనలు చెడ్డవీ, మంచివీ కూడా జరిగాక, అనేక వస్తువులు అందులోంచి వచ్చాక.. చివరికి అమృతం బయటకు వస్తుంది. దీంతో దాన్ని తాగేందుకు రాక్షసులు, దేవతలు పరస్పరం పోటీ పడి జగడానికి దిగుతారు. అది లోకానికి మంచిది కాదని భావించిన విష్ణువు మోహిని అనే స్త్రీ రూపంలో వచ్చి దేవతలు, రాక్షసులను పంక్తుల్లో ఎదురెదురుగా కూర్చోబెట్టి వారికి పంచేందుకు సిద్ధమవుతాడు. అయితే మోహిని వేషంలో ఉన్న విష్ణువు రాక్షసులను మోసం చేస్తూ కేవలం దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచుతుంటాడు. దీన్ని రాహువు అనే రాక్షసుడు గ్రహించి దేవతల మధ్యలో దూరుతాడు. అనంతరం అమృతాన్ని తీసుకుంటాడు. ఈ విషయాన్ని సూర్యుడు, చంద్రుడు తెలుసుకుని విష్ణువుకు చెబుతారు. దీంతో విష్ణువు రాహువు తల నరుకుతాడు. అయితే అప్పటికే రాహువు అమృతం తాగి ఉండడం వల్ల చావడు. కానీ తల, మొండెం వేరే అవుతాయి. అవి రెండు వేర్వేరు వ్యక్తులుగా మారుతాయి. ఆ వ్యక్తులను రాహు, కేతులు అని పిలవడం ప్రారంభించారు.
అలా జరిగినప్పటి నుంచి రాహు, కేతులు ఇద్దరూ సూర్యుడు, చంద్రులను మింగడానికి యత్నిస్తుంటారు. అలాంటి సందర్భాల్లోనే సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడుతుంటాయి. ఆ సమయంలో దేవతల శక్తి నశిస్తుందట. అందుకని ఆలయాల్లో ఉండే వారి ప్రతిమల్లో శక్తి నశించకుండా ఉండేందుకు గాను ఆలయాలను మూసేస్తారు. గ్రహణం విడిచాకే ఆలయాలను తెరుస్తారు. అయితే అన్ని ఆలయాలను గ్రహణం సమయంలో మూసేస్తారు కానీ శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం మూయరు. ఎందుకో తెలుసా..? అక్కడ నవగ్రహ కవచం ఉందట. అందుకని గ్రహణం పట్టినా ఆ సమయంలో ఆ ఆలయంలోని దైవశక్తి నశించదు. అందుకే ఆ ఆలయాన్ని గ్రహణం సమయంలోనూ తెరిచి ఉంచుతారు. ఇక అదే సమయంలో పూజలు చేస్తే అనుకున్నది నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు. కాబట్టి గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు చేసే వారి సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది.