Bhogi Pandlu : తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పండుగను ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ముఖ్యంగా ఏపీలో కోస్తాంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండుగకు ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మకర సంక్రాంతి అంటారు. అదే రోజు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగ రోజు మహిళలు తమ వాకిళ్ల ముందు అందమైన రంగవల్లికలను తీర్చిదిద్ద వాటి మధ్యలో గొబ్బెమ్మలను పెడతారు. ఇక గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. సంక్రాంతి ముందు రోజు జరుపుకునే భోగి పండుగ రోజు భోగి మంటలు వేస్తారు. మూడో రోజు పండుగను కనుమ రూపంలో జరుపుకుంటారు. ఈ క్రమంలో మొత్తం 3 రోజుల పాటు పండుగ వాతావరణం ఉంటుంది. పిల్లలు పతంగులను ఎగురవేస్తూ పిండి వంటలను ఆరగిస్తూ సందడి చేస్తుంటారు.
అయితే సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి పండుగ నాడు చిన్నారుల తలపై కచ్చితంగా భోగి పండ్లను పోయాల్సిందే. ఎందుకంటే.. భోగి పండ్లను పిల్లల తలలపై పోయడం వల్ల శ్రీమహావిష్ణువు దివ్య ఆశీస్సులు లభిస్తాయి. దీంతో పిల్లలు భోగ భాగ్యాలతో తులతూగుతారు. అలాగే పిల్లలపై ఉండే చెడు దృష్టి పోతుంది. దుష్ట శక్తుల ప్రభావం తగ్గుతుంది. తలపై భాగంలో బ్రహ్మ రంధ్రం ఉంటుంది. కనుక పిల్లల తలపై భోగి పండ్లను పోయడం వల్ల ఆ పండ్లు ఆ రంధ్రపై పడతాయి. దీంతో ఆ రంధ్రం ఉత్తేజితం అవుతుంది. ఈ క్రమంలో పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. తెలివితేటలు వస్తాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చదువుల్లో, ఆటపాటల్లో రాణిస్తారు. కనుక భోగి రోజున పిల్లల తలపై కచ్చితంగా భోగి పండ్లను పోయాల్సి ఉంటుంది.
ఇక భోగి పండ్లను తయారు చేసేందుకు గాను రేగు పండ్లు, చెరుకు గడల ముక్కలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు కలుపుతారు. కొందరు శనగలను కూడా కలుపుతారు. రేగి పండ్లనే భోగి పండ్లుగా వ్యవహరిస్తారు. కానీ వాటిని నేరుగా పోయకూడదు. ముందు చెప్పినట్లుగా వాటిల్లో ఆయా పదార్థాలను, వస్తువులను కలిపి అనంతరం పిల్లల తలపై భోగి పండ్లను పోసి వారిని ఆశీర్వదించాలి. దీంతో వారిపై ఉండే దుష్ట ప్రభావాలు తొలగిపోతాయి. వారికి ఆరోగ్యం కలుగుతుంది. తెలివితేటలు వస్తాయి. ఇక పూర్వ కాలంలో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేశారట. దీంతో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారట. బదరీ ఫలాలు అంటే రేగు పండ్లు. కనుక రేగు పండ్లకు అంతటి శక్తి ఉంది కాబట్టే పిల్లల తలపై వాటిని పోస్తారు. ఇక భోగి పండ్లను పిల్లలపై పోయడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి. 12 ఏళ్ల లోపు పిల్లలపై భోగి పండ్లను పోయవచ్చు.