తొడ‌లు రాసుకుని ఎర్ర‌గా కందిపోయిన‌ట్లు అవుతున్నాయా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

మ‌న‌లో కొందరికి అప్పుడ‌ప్పుడు తొడ‌లు రాసుకుని ఎర్ర‌గా కందిపోయిన‌ట్లు అవుతాయి. ఆ ప్రాంతంలో దుర‌ద‌, మంట వ‌స్తాయి. చ‌ర్మం రాసుకుపోవ‌డం వ‌ల్ల ఆ విధంగా అవుతుంది. రెండు తొడ‌లు ఎరుపెక్కి దుర‌ద పెడ‌తాయి. దీంతో తీవ్ర‌మైన అసౌక‌ర్యంగా అనిపిస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఆ స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..

chafed thighs home remedies

* చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో క‌ల‌బంద ఎంత‌గానో ప‌నిచేస్తుంది. గాయాలు, పుండ్ల‌ను కూడా ఇది త్వ‌ర‌గా మానేలా చేస్తుంది. కొద్దిగా క‌ల‌బంద గుజ్జును కందిపోయిన తొడ‌ల‌పై రాస్తుండాలి. దీంతో ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

* కొబ్బ‌రినూనెలోనూ చ‌ర్మాన్ని సంర‌క్షించే గుణాలు ఉంటాయి. ఇది వాపులను త‌గ్గిస్తుంది. గాయాలు, పుండ్ల‌ను మానుస్తుంది. కందిపోయిన తొడ‌ల‌పై కొబ్బ‌రినూనె రాస్తున్నా ఫ‌లితం ఉంటుంది.

* సాధార‌ణంగా కొంద‌రికి చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్ట‌డం వల్ల తొడ‌లు రాసుకున్న‌ప్పుడు కందిపోతుంటాయి. అలాంటి వారు మొక్క‌జొన్న పిండిని కొద్దిగా తీసుకుని టాల్కం పౌడ‌ర్‌ను చ‌ల్లిన‌ట్లు చ‌ల్లాలి. దీంతో చెమ‌ట ప‌ట్ట‌దు. స‌మ‌స్య ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.

* ఐస్ క్యూబ్స్ కొన్ని తీసుకుని ఒక ప‌లుచ‌ని వ‌స్త్రంలో చుట్టి వాటితో స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో మ‌ర్ద‌నా చేసిన‌ట్లు సున్నితంగా రాయాలి. ఒక్కో తొడ‌కు 5 నిమిషాల పాటు అలా చేయాలి. దీంతో స‌మ‌స్య త‌గ్గుతుంది.

* ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 3 టేబుల్ స్పూన్ల నీరు, కొన్ని చుక్క‌ల ల‌వంగం నూనెల‌ను తీసుకుని మిశ్రమంగా బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని తొడ‌లు రాసుకునే చోట అప్లై చేయాలి. 5 నిమిషాలు ఆగాక వేడినీటితో క‌డిగేయాలి. దీని వ‌ల్ల మంట‌, దుర‌ద వంటివి తగ్గి స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

* స్నానం చేసిన త‌రువాత కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని తొడ‌లు రాసుకునే చోట అప్లై చేయాలి. ఆయిల్ పోయింద‌నుకుంటే మళ్లీ కొంత ఆయిల్‌ను తీసుకుని అప్లై చేయాలి. రోజులో ఇలా ఎక్కువ సార్లు చేస్తే ఫ‌లితం ఉంటుంది. స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts