కరోనా వైరస్ ఇంకా అంతం అవనేలేదు. అప్పుడే ఇంకో వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కేరళలో జికా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది పాతదే అయినప్పటికీ ఇప్పుడు ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడం ఆందోళనను కలిగిస్తోంది. కేరళలో ఇప్పటికే 15 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తోంది. అయితే ఇంతకీ అసలు జికా వైరస్ అంటే ఏమిటి ? దీని బారిన పడితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ? అడ్డుకోవడం ఎలా ? ఈ వైరస్ బారిన పడితే చికిత్స ఏమిటి ? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం జికా వైరస్ దోమలు కుట్టడం వల్ల వస్తుంది. ఏడిస్ జినస్ అనే దోమలు ఈ వైరస్‌కు క్యారియర్లుగా పనిచేస్తాయి. అంటే ఈ దోమల్లో వైరస్ ఉంటుంది. కానీ అది వాటిని ఏమీ చేయదు. కాకపోతే ఆ వైరస్ కలిగిన దోమలు కుడితే మనకు వైరస్ వ్యాప్తి చెందుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. సదరు దోమలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూట కుడతాయి. ఇక అవే దోమలు డెంగ్యూ, చికున్ గున్యా, యెల్లో ఫీవర్‌లను కలగజేస్తాయి. అందువల్ల దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
జికా వైరస్ సోకిన వారిలో పలు లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కళ్లు ఎర్రగా మారడం, కండరాల నొప్పులు వంటి సమస్యలు వస్తాయి. జికా వైరస్ వ్యాధి ఇంకుబేషన్ సమయం 3-14 రోజులు. కాగా లక్షణాలు 2-7 రోజుల మధ్య కనిపిస్తాయి. అయితే అందరిలో లక్షణాలు కనిపించాలని ఏమీ లేదు. కొందరిలో కొన్ని లక్షణాలు మాత్రమే కనిపించవచ్చు. కొందరిలో అసలు లక్షణాలు లేకపోవచ్చు. కానీ ఉంటే మాత్రం వెంటనే చికిత్స తీసుకోవాలి.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతున్న ప్రకారం జికా వైరస్ గర్భం ధరించిన మహిళ నుంచి కడుపులోని శిశువుకు సోకే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల శిశువులు జన్మించినప్పుడు పుట్టుక లోపాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. జికా వైరస్ ఉన్న వ్యక్తితో శృంగారంలో పాల్గొంటే ఆ వైరస్ ఇతరులకు కూడా వ్యాప్తి చెందుతుంది.
జికా వైరస్ నుంచి రక్షణగా ఉండేందుకు పలు సూచనలు పాటించాలి. చిన్నారులు, పెద్దలు ఎవరైనా సరే చేతులు, కాళ్లను కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలి. దోమలు రాకుండా, దోమలు కుట్టకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంటి చుట్టూ పరిశుభ్రతను పాటించాలి. ఇంటి లోపలికి దోమలు రాకుండా చూసుకోవాలి. సహజసిద్ధమైన మస్కిటో రిపెల్లెంట్‌లను వాడడం లేదా దోమ తెరలను వాడడం చేయాలి.
జికా వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్‌ను కనుగొనలేదు. అందువల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుగానే జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. జికా వైరస్ వచ్చిన వారికి లక్షణాలు తెలియకపోతే గుర్తించలేం. కానీ లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్సను తీసుకోవాలి. డాక్టర్లు లక్షణాలకు అనుగుణంగా మందులను ఇస్తారు. జికా వైరస్ సోకిన వారు ఇంట్లో చికిత్స తీసుకోవాలి. ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి. ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవాలి. లేదంటే ఒకరికి ఉన్న వైరస్ ఇంకొకరికి దోమల ద్వారా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365