రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినివా తిరుమలకు చేరుకున్నారు. కొద్దిరోజుల కిందట సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి పవన్ కల్యాణ్ దంపతుల కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. తమ బిడ్డకు దైవ కృపతో పునర్జన్మ లభించినట్లయిందని, ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అన్నా మొక్కుకున్నారు.
సింగపూర్ నుంచి పవన్ కల్యాణ్, అన్నా తమ బిడ్డను తీసుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మొక్కులు చెల్లించుకొనేందుకు అన్నా కొణిదల దంపతులు తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ నిబంధనలు అనుసరిస్తూ – గాయత్రి సదనంలో అధికారుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు.
అనంతరం వరాహ స్వామి వారి దర్శనానికి వెళ్లారు. స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వరాహ స్వామి వారి దర్శనం తరవాత పద్మావతి కళ్యాణ కట్టకు చేరుకున్నారు. అక్కడ భక్తులందరితోపాటు తలనీలాలు సమర్పించారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లారు. సుప్రభాత సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులకు నిత్యాన్నదానానికి విరాళం అందించారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరించారు.