Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ కానీ.. డబ్బు కానీ లేకుండా.. సొంత టాలెంట్‌తో కష్టపడి.. సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్ అయ్యారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే. ఆయన సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన గురించి దాదాపుగా ప్రతి ఒక్క విషయమూ మనందరికీ తెలుసు. అయితే ఆయన గురించి ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఆయన వివాహం కూడా ఒకటి. దీని గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రముఖ నిర్మాత, దర్శకుడు ధవళ సత్యం ఇటీవల వెల్లడించారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవికి చెందిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
చిరంజీవి అప్పట్లో హీరోగా నిలదొక్కుకుంటున్న రోజులు. ఆయన ఇంకా పూర్తి స్థాయి హీరో కాలేదు. ఆ సమయంలో అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖను చిరంజీవికి ఇచ్చి వివాహం చేద్దామని అనుకున్నారు. అయితే ముందుగా ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పాక ధవళ సత్యంను కూడా అల్లు రామలింగయ్య ఒక మాట అడిగారట. కుర్రాడికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నానని.. అతను ఎలా ఉంటాడని.. అడిగారట. దీంతో ధవళ సత్యం.. చిరంజీవి మంచి స్టార్ హీరో అవుతాడని.. అణకువ ఉండే వ్యక్తి అని, మంచి వ్యక్తి అని.. కనుక అమ్మాయిని ఇచ్చి వివాహం చేయొచ్చు.. అని సత్యం చెప్పారట. దీంతో అల్లు రామలింగయ్య సురేఖను చిరంజీవికి ఇద్దామని రెడీ అయ్యారు.
అయితే అల్లు రామలింగయ్య ఇదే విషయాన్ని చిరంజీవి తండ్రికి చెప్పేందుకు వెళితే ఆయన ముందుగా అంగీకరించలేదట. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కనుక వారి అమ్మాయి మన ఇంట్లో ఉంటుందా.. అని సందేహం వ్యక్తం చేశారట చిరంజీవి తండ్రి. అయితే అల్లు రామలింగయ్య, సత్యం ఇద్దరూ కలసి ఆయనను ఒప్పించారట. దీంతో ఆయన అంగీకరించారు. అలా చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. తరువాత సత్యం చెప్పినట్లుగానే చిరంజీవి సుప్రీం హీరో అయ్యారు. తరువాత మెగాస్టార్‌గా మారారు. ఎంతో మంది అభిమానుల ఆదరణను చూరగొన్నారు. ఇప్పటికీ ఆయన సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు.