చిరంజీవి చిన్న కేరక్టర్స్ నుండి పైకి ఎదుగుతున్న క్రమంలో ఆయన మొదటిగా పోటీనెదుర్కొన్నది సుమన్ నుండే. సితారతో మొదలుకొని ఆయన ప్రస్థానం విజయందిశగా సాగిపోతుంది. హీరోగా ఏఎన్నార్ విరమించుకోవడం, ఎన్టీఆర్ రాజకీయాల్లోకెళ్ళి పోవడంతో ఏర్పడ్డ వెలితిని కృష్ణ ఒక్కరే నింపలేరు కనుక యంగ్ హీరోస్ మంచి అవకాశాలతో ముందుకెళుతున్నారు.
శోభన్ బాబు, కృష్ణంరాజులను తప్పించి చిన్న సీనియర్ హీరోలు ఎలాగూ పోటీపడలేరు. ఇక భానుచందర్ అన్నిరకాల పాత్రలు పోషిస్తుంటే బాలకృష్ణ రూపంలో ఇంకొక పోటీ మొదలైంది. మొదట్లో కొన్ని సినిమాలు పోయినా మంగమ్మ గారి మనవడు మంచి హిట్ కావడంతో యంగ్ హీరోల పోటీ మంచి పాకంలో పడింది. సరిగ్గా ఈ సమయంలో ఖైదీ సినిమాతో చిరంజీవి పోటీ లో ముందడుగు వేసారు. ఇపుడు సీనియర్ హీరోలకి యంగ్ హీరోస్ ముగ్గురుతోడయ్యారు. మంచి పోటీ నడుస్తున్నపుడు సుమన్ జైలుకు పోవడంతో చిరంజీవి బాగా లాభ పడ్డారు. దీనికి ఎన్నో కథలు పుకార్ల రూపంలో ప్రచారమయ్యాయి.
85 ప్రాంతంలో కృష్ణరు రాజకీయ సినిమాలకి పరిమితమైపోయి పోటీలో వెనకపడిపోవడంతో చిరంజీవి బాలకృష్ణల మధ్య చాలాగట్టి పోటీయే నడిచినా మంచి సినిమాలు సెలక్ట్ చేసుకొంటూ చిరంజీవి ముందుకెళ్ళి పోయారని చెప్పవచ్చు.
అదే సమయంలో వచ్చాయి రెండు సినిమాలు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం. ఈ సినిమాలతో చిరంజీవి కృష్ణని కూడా దాటుకుని ముందుకెళ్ళిపోయి గాంగ్ లీడర్ తో మెగాస్టార్ అయిపోయారు.