నిత్యం ఎక్కువగా శారీరక శ్రమ చేసే వారికి ఒళ్ల నొప్పులు వస్తుంటాయి. దీంతోపాటు బాగా నడిచే వారికి కూడా అలాంటి పెయిన్స్ కామన్‌గా వస్తుంటాయి. ఈ సందర్భంలో ఎవరికైనా ఒక్కోసారి పాదాలు, కాళ్లు విపరీతంగా నొప్పులు పుడతాయి. దీంతో ఆ నొప్పులను తగ్గించుకునేందుకు వారు నానా తంటాలు పడుతుంటారు. అయితే కింద ఇచ్చిన పలు టిప్స్‌ను పాటిస్తే పాదాల నొప్పులను సులభంగా తగ్గించుకోవచ్చు. దీంతోపాటు కాలి నొప్పులు కూడా తగ్గుతాయి. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. నేలపై నిలబడి పాదం వెనుక భాగం నేలకు ఆనేలా ఉంచి ముందు భాగం వేళ్ల వరకు మాత్రమే పైకి లేపాలి. అలా లేపి కొంత సేపు అలాగే ఉండాలి. అనంతరం రెండో కాలును కూడా ఇలాగే చేయాలి. కనీసం 5 నిమిషాల పాటు ఇలా చేస్తే పాదాల నొప్పులు తగ్గిపోతాయి.
నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాపాలి. శరీరాన్ని ముందుకు వంచి కాలి వేళ్లను చేతులతో వెనక్కి వంచాలి. ఈ భంగిమలో 2-3 నిమిషాల పాటు ఉండాలి. ఇలా ఒక్కో కాలును ఒక్కో సారి చేయాలి. దీంతో పాదాలు, కాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఒక టెన్నిస్ బాల్‌ను తీసుకుని దానిపై ఒక పాదం ఉంచాలి. అనంతరం ఆ బాల్‌ను పాదంతో గట్టిగా అదుముతూ నేలపై రాసినట్టు చేయాలి. ఇలా ఒక కాలుకు 2, 3 నిమిషాల పాటు చేసి మళ్లీ రెండో కాలుకు ఇలాగే చేయాలి. దీంతో పాదాల నొప్పి తగ్గుతుంది. నేలపై నిలబడి కాలి వేళ్లపై శరీర భారం మొత్తాన్ని మోపుతూ పాదం వెనుక భాగాన్ని గాలిలోకి లేపి అలా కొంత సేపు నిలబడాలి. ఈ వ్యాయామం 10 నిమిషాల పాటు చేస్తే పాదాలు, కాళ్ల నొప్పులు పోతాయి.
నేలపై పడుకుని కాళ్లను పైకి మడవాలి. అనంతరం పాదాల కింద ఓ స్ట్రెచ్ బాల్‌ను ఉంచి దానిపై ఒత్తిడి కలిగిస్తూ నేలపై రాసినట్టు చేయాలి. దీంతో కూడా పాదాల నొప్పులు తొలగిపోతాయి. చిన్నపాటి టబ్ లాంటి పాత్రను తీసుకుని అందులో పాదాలు మునిగేలా గోరువెచ్చని నీటిని పోయాలి. అందులో కొంత ఎప్సం సాల్ట్‌ను వేసి బాగా కలియబెట్టాలి. అనంతరం ఆ నీటిలో పాదాలను కొంత సేపు ఉంచాలి. దీంతో కూడా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.