మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇది శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. మనం తినే ఆహారంలో ఉండే ప్రోటీన్లను విభజించి మనకు శక్తిని అందిస్తుంది. దీంతోపాటు జీర్ణక్రియకు అవసరం అయ్యే జీవ రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇలా లివర్ అనేక పనులు చేస్తుంది. అయితే నిత్య జీవితంలో మనం పాటించే అనేక అలవాట్లు, తినే ఆహారాల వల్ల లివర్ అనారోగ్యానికి గురవుతుంది. దీంతో ఇతర సమస్యలు వస్తాయి. కనుక దాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన ఆహారాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపులో కర్‌క్యుమిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. పసుపు యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. లివర్‌కు హెపటైటిస్ బి, సి వంటి వ్యాధులు రాకుండా చూస్తుంది. రోజు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపును కలుపుకుని రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. అందులోని వ్యర్థాలు బయటకు పోతాయి.
అవకాడోలో మన శరీరానికి ఉపయోగపడే విటమిన్లు, మినరల్స్ ఎన్నో ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అవకాడోల్లో గ్లూటాథియోన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది లివర్‌లోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
తరచూ బొప్పాయి పండ్లను తినడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ సిర్రోసిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. బొప్పాయిలో ఉండే పొటాషియం లివర్, కిడ్నీలకు ఎంతగానో మేలు చేస్తుంది. వాటిల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. ముఖ్యంగా శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా ఉంటుంది. దీని వల్ల గౌట్ వంటి సమస్యలు రావు.
వెల్లుల్లిలో అల్లిసిన్ అనబడే సమ్మేళనంతోపాటు విటమిన్ సి, కె, ఫోలేట్, నియాసిన్, థయామిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని సంరక్షిస్తాయి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ లివర్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తుంది. దీని వల్ల శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. అలాగే వెల్లుల్లిలోని సెలీనియం లివర్ దెబ్బ తినకుండా సంరక్షిస్తుంది.
ఉసిరికాయల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. లివర్‌ను సంరక్షిస్తుంది. లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. రోజుకు 3-4 ఉసిరికాయలను తింటున్నా లేదా పరగడుపునే ఉసిరికాయల రసాన్ని తాగినా లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ వ్యాధులు రాకుండా ఉంటాయి.
పాలకూర, క్యారెట్‌లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు సరిగ్గా ఉంటాయి. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ పాలకూర, క్యారెట్‌లను కలిపి జ్యూస్ రూపంలో తీసుకుంటే లివర్ సురక్షితంగా ఉంటుంది.
ఆకుపచ్చని కూరగాయల్లో విటమిన్లు ఎ, సి, కె, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ది చేస్తాయి. లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
మన శరీరానికి అవసరం అయ్యే అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు బీట్‌రూట్‌లో ఉంటాయి. బీటాలెయిన్స్ అనబడే బయో యాక్టివ్ సమ్మేళనాలు కూడా బీట్‌రూట్‌లో ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. బీట్‌రూట్ లో ఉండే నైట్రేట్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వాపులను తగ్గిస్తాయి. రోజూ బీట్‌రూట్ జ్యూస్‌ను తాగడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. అందువల్ల రోజూ బీట్‌రూట్ జ్యూస్‌ను తాగితే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
రోజూ ఉదయాన్నే చాలా మంది ఒక కప్పు కాఫీ లేదా టీ తాగుతారు. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ చేసిన వెంటనే కాఫీ లేదా టీ తాగనిదే చాలా మంది ఏ పనీ మొదలు పెట్టరు. అయితే వాటికి బదులుగా గ్రీన్ టీ తాగాలి. దీని వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. గ్రీన్ టీలో కాటెచిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి లివర్‌ను శుభ్ర పరుస్తాయి. లివర్‌లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. లివర్ వాపులు తగ్గుతాయి. లివర్ సురక్షితంగా ఉంటుంది.
వాల్‌నట్స్‌లో విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ అనేక రకాల వ్యాధులు రాకుండా చూస్తాయి. వాల్‌నట్స్‌లో ఆర్గైనైన్ అనబడే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది లివర్‌ను శుభ్ర పరుస్తుంది. వాల్‌నట్స్‌లో వృక్ష సంబంధ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365