Categories: Featured

కూర‌గాయ‌ల్లో ఉన్న పోష‌కాలను కోల్పోకుండా ఉండాలంటే వాటిని ఎలా వండాలి ?

నిత్యం మ‌నం చేసే అనేక పొర‌పాట్ల వ‌ల్ల కూర‌గాయ‌ల్లో ఉండే పోషకాలు పోతుంటాయి. వాటిని కొనుగోలు చేసి తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టి త‌రువాత తీసి క‌డిగి వండి తినేస‌రికి వాటిల్లో ఉండే పోష‌కాల సంఖ్య త‌గ్గుతుంది. దీంతో మ‌నం తినే కూర‌గాయ‌ల్లో చాలా త‌క్కువ పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న శ‌రీరానికి స‌రిపోవు. క‌నుక కూర‌గాయ‌లలో ఉండే పోష‌కాలు త‌గ్గ‌కుండా ఉండాలంటే వాటిని కింద తెలిపిన ప‌ద్ధ‌తిలో వండాల్సి ఉంటుంది. మ‌రి ఆ ప‌ద్ధ‌తి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

kooragayalu vande padhathi idi

* ఎక్కువ సేపు కూర‌గాయ‌లను ఉడ‌క‌బెడితే వాటిల్లో ఉండే పోషకాలు న‌శిస్తాయి. అందువ‌ల్ల వాటిని త‌క్కువ టైం పాటు ఉడికించాలి. అయితే మ‌రి ఆ టైంలోగా కూర‌గాయ‌లు ఉడ‌క‌వు క‌దా. అంటే.. అవును.. కానీ త‌క్కువ స‌మ‌యంలో కూర‌గాయ‌లు ఉడ‌కాలంటే వాటిలో ముందుగానే ఉప్పు వేయాలి. దీంతో అవి త్వ‌ర‌గా ఉడుకుతాయి. స‌మ‌యం త‌క్కువ ప‌డుతుంది క‌నుక పోష‌కాలు కూడా న‌శించ‌కుండా ఉంటాయి.

* సాధార‌ణంగా కొంద‌రు కూర‌గాయ‌లు క‌ట్ చేశాక క‌డుగుతారు. అలా చేస్తే పోష‌కాలు పోతాయి. క‌నుక కూర‌గాయ‌ల‌ను ముందుగా క‌డ‌గాల్సి ఉంటుంది. త‌రువాతే వాటిని క‌ట్ చేయాలి. దీంతో పోషకాలు అలాగే ఉంటాయి.

* అన్నం వండే స‌మ‌యంలో చాలా మంది నీటిని ఎక్కువ‌గా పోసి అన్నం వండుతారు. దీంతో గంజి వ‌స్తుంది. ఆ గంజిని పార‌బోస్తారు. అయితే గంజిని పార‌బోయ‌కూడ‌దు. అందులో ఉడికించిన కూర‌గాయ‌లు వేసి తీసుకోవ‌చ్చు. దీంతో బియ్యంలో ఉండే పోష‌కాలు మ‌న‌కు గంజి ద్వారా ల‌భిస్తాయి. అయితే గంజి రాకుండా కూడా అన్నం వండుకోవ‌చ్చు. దీంతో పోష‌కాలు అందులో అలాగే ఉంటాయి. ఈ రెండు విధాలుగా చేస్తే బియ్యం ద్వారా వ‌చ్చే పోష‌కాల‌ను అందుకోవ‌చ్చు.

* కూర‌గాయ‌ల‌ను అడ్డం దిడ్డంగా క‌ట్ చేయ‌కూడ‌దు. వాటిని దాదాపుగా ఒకే సైజ్ వ‌చ్చేట్లు క‌ట్ చేయాలి. అలాగే త‌క్కువ నీటిలో ఉడికించాలి. దీంతో పోష‌కాలు న‌శించ‌కుండా ఉంటాయి.

* కొంద‌రు కూర‌గాయ‌ల రంగు అలాగే ఉండాల‌ని చెప్పి వంట‌ల్లో బేకింగ్ సోడా వేస్తారు. అది నిజమే. కానీ దాని వ‌ల్ల కూర‌గాయ‌ల్లో ఉండే పోష‌కాలు న‌శిస్తాయి. క‌నుక పోష‌కాలు కావాలంటే వంట‌ల్లో బేకింగ్ సోడాను వేయ‌కూడ‌దు.

* కొంద‌రు ప‌చ్చి కూర‌గాయ‌ల‌కు పొట్టు తీసి త‌రువాత వాటిని ఉడికిస్తారు. కానీ అలా కాకుండా కూర‌గాయ‌ల‌ను పొట్టు తీయ‌కుండానే ఉడికించి త‌రువాత పొట్టు తీయాలి. దీంతో పోష‌కాలు అలాగే ఉంటాయి. బంగాళాదుంప‌ల‌ను పొట్టు తీయ‌కుండా కొన్ని సార్లు అలాగే ఉడికిస్తాం క‌దా. త‌రువాత పొట్టు తీస్తాం. అలాగ‌న్న‌మాట‌.

* కూర‌గాయ‌ల‌ను కొంద‌రు నీటిలో నాన‌బెడ‌తారు. అలా చేస్తే నీటిలో క‌రిగే విట‌మిన్లు నీటిలో క‌రిగిపోతాయి. దీంతో కూర‌గాయ‌ల్లో విట‌మిన్లు ఉండ‌వు. మ‌నం వ‌ట్టి చెత్త‌ను తిన్న‌ట్లు అవుతుంది. క‌నుక కూర‌గాయ‌ల‌ను నీటిలో నాన‌బెట్ట‌రాదు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts