Masala Chai Powder : ప్రతి రోజూ చాలా మంది టీ తాగుతూ ఉంటారు. చాలా మంది ఉదయం టీతోనే వారి రోజుని మొదలు పెడుతుంటారు. అయితే మామూలు టీ కాకుండా ఈ విధంగా టీ తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. అలానే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈరోజు ఒక మంచి టీ మసాలా రెసిపి గురించి చూసేద్దాం. ఇలా కనుక టీ ని తయారు చేసుకుంటే టీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఛాయ్ మసాలాని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ పెట్టి అందులో మూడు పెద్ద స్పూన్లతో యాలకులు వేయండి. 10 గ్రాముల వరకు దాల్చిన చెక్కని వేయండి.
రెండు స్పూన్ల సోంపు కూడా ఇందులో వేసుకోండి. 10 గ్రాముల వరకు నల్ల మిరియాలని కూడా వేసుకోండి. ఇప్పుడు పెద్ద యాలకులు వేసుకోండి. వీటిని నల్ల యాలకులు అంటారు. నల్ల యాలకులు వేసుకునేటప్పుడు తొక్క తీసేసి గింజలని వేసుకోవాలి. దీనిలో ఒక జాజికాయని కూడా వేసేయండి. ఎనిమిది గ్రాముల వరకు లవంగాలను కూడా ఇందులో వేసేయాలి.
వీటిని అన్నింటినీ మీరు బాగా వేయించుకుని చల్లార్చండి. 10 గ్రాముల అతి మధురం పొడి, పటిక బెల్లం 30 గ్రాములు, శొంఠి పొడి 10 గ్రాముల వరకు తీసుకుని పక్కన ఉంచుకోండి. వేయించుకున్న వాటితోపాటు పటిక బెల్లం ముక్కలు, అతిమధురం, శొంఠి కూడా వేసి మెత్తగా వీటిని మిక్సీ పట్టుకోండి. దీనిని మీరు స్టోర్ చేసుకుని ఎక్కువ రోజులు పాటు నిల్వ ఉంచుకోవచ్చు.
ఇప్పుడు టీ కోసం మీరు ఒక గిన్నెలో నీళ్లు వేసి మరిగించాలి. నీళ్లు మరిగాక అందులో టీ పొడి, పంచదార వేసి బాగా మరిగాక అందులో పాలు పోసుకోవాలి. టీ బాగా మరిగిన తర్వాత ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని ఇందులో వేయాలి. తర్వాత టీ ఫిల్టర్ తో వడకట్టుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఈ టీ ఉంటుంది. కావాలంటే ఈసారి ట్రై చేసి చూడండి.