మటన్‌తో చాలా మంది అనేక రకాల వంటకాలను చేసుకుని తింటారు. కానీ దాన్ని గోంగూరతో కలిపి వండితే భలే రుచిగా ఉంటుంది. మసాలాలు, ఇతర పదార్థాలు వేసి వేడి వేడిగా వండితే గోంగూర మటన్ భలే మజాగా అనిపిస్తుంది. అంతేకాదు.. రెండింటిలోనూ ఉండే పోషకాలు కూడా మనకు లభిస్తాయి. మరి గోంగూర మటన్‌ను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
గోంగూర మటన్ తయారీకి కావల్సిన పదార్థాలు:
మటన్ – అర కిలో, గోంగూర – 3 కట్టలు, పచ్చిమిర్చి – 6, పసుపు – 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టేబుల్ స్పూన్, గరం మసాలా – 1 టీ స్పూన్, ఉల్లిపాయ – 1, నూనె – 1 టేబుల్ స్పూన్, కారం – 2 టీ స్పూన్లు, ధనియాల పొడి – 1 టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
గోంగూర మటన్ తయారు చేసే విధానం:
మటన్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసి అన్నింటినీ కుక్కర్‌లో వేయాలి. అనంతరం అందులో కొద్దిగా నీళ్లు పోసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పాన్ తీసుకుని అందులో నూనె పోసి వేడెక్కాక.. ఉల్లిపాయలు, గరం మసాలా వేసి 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కట్ చేసిన పచ్చిమిర్చి, గోంగూర వేసి బాగా కలిపి సన్నని మంట మీద ఉడకించాలి. అనంతరం ఉడికిన మటన్, తగినంత ఉప్పు వేసి కలిపి 10 నిమిషాల పాటు ఉడికించి దించాలి. అంతే.. వేడి వేడి గోంగూర మటన్ రెడీ అవుతుంది. దాన్ని అన్నం లేదా చపాతీలతో లాగించవచ్చు.