Garam Masala Powder : గరం మసాలా పొడిని సాధారణంగా మనం కూరల్లో తరచూ ఉపయోగిస్తుంటాం. మసాలా వంటకాలు లేదా నాన్ వెజ్ వంటలను వండేటప్పుడు గరం మసాలా వేస్తే చక్కని వాసన వస్తుంది. దీంతోపాటు వంటలు రుచి కూడా ఉంటాయి. అయితే గరం మసాలాను చాలా మంది బయట కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ పొడిని మనం ఎంతో సులభంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బయట కొనుగోలు చేసే గరం మసాలా పొడి కన్నా ఇంట్లో తయారు చేసుకున్న పొడి ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. పైగా రుచి, వాసన ఎక్కువగా ఉంటాయి. ఇక గరం మసాలా పొడిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గరం మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
యాలకులు – ఒక కప్పు (పొట్టు తీసినవి), జీలకర్ర – అర కప్పు, దాల్చిన చెక్కలు – 5 (ఒక్కోటి 2 లేదా 3 ఇంచులు ఉండాలి), నల్ల మిరియాలు – అర కప్పు, లవంగాలు – అర కప్పు, ధనియాలు – అర కప్పు, తురిమిన కొబ్బరి – పావు కప్పు.
గరం మసాలా పొడిని తయారు చేసే విధానం..
యాలకులు తప్ప మిగిలిన అన్ని పదార్థాలను పాన్‌లో వేసి నూనె లేకుండా వేయించుకోవాలి. గోధుమ రంగులోకి మారకుండా చూసుకోవాలి. అంతకన్నా ముందే అన్నింటినీ తీసి పక్కన పెట్టాలి. చల్లారాక వాటిల్లో పొట్టు తీసిన యాలకులు వేసి బాగా కలపాలి. అనంతరం వాటిని మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. అంతే.. గరం మసాలా పొడి రెడీ అవుతుంది. దీన్ని గాలి చొరబడని సీసాలో నిల్వ చేస్తే నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరల్లో వేసుకోవచ్చు. ఇలా గరం మసాలా పొడిని ఇంట్లోనే తయారు చేయడం వల్ల సహజసిద్ధంగా ఉంటుంది. పైగా బయట దీన్ని కొనాల్సిన పని ఉండదు.