కరోనా గతేడాది కన్నా ఈ సారి మరింత ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఆ వైరస్‌కు చెందిన పలు వేరియెంట్లు ప్రస్తుతం ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. ఇక కోవిడ్ డెల్టా ప్లస్ వేరియెంట్‌ను ఈ ఏడాది మార్చిలో మొదటి సారిగా యూరప్‌లో గుర్తించారు. అయితే ఇది భారత్‌తోపాటు ప్రపంచాన్ని కూడా భయపెడుతోంది.
మహారాష్ట్రలో ఆగస్టు 13, 2021 శుక్రవారం వరకు కోవిడ్ డెల్టా ప్లస్ వేరియెంట్ కారణంగా 5 మంది చనిపోయారు. ఈ వివరాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలోనే చాలా మందిలో కోవిడ్ మూడో వేవ్ గురించి భయాందోళనలు నెలకొన్నాయి.
డెల్టా ప్లస్ వేరియెంట్ 3 రకాలుగా ఉంటుంది. AY.1, AY.2, AY.3 అని దీన్ని మూడు రకాలుగా విభజించారు. డెల్టా వేరియెంట్‌కు దీనికి దగ్గరి పోలికలు ఉంటాయి. డెల్టా వేరియెంట్ ను ముందుగా భారత్‌లో గుర్తించారు. అయితే డెల్టా వేరియెంట్ స్వల్పంగా మారి డెల్టా ప్లస్ గా ఆవిర్భవించింది. దీంతో ఈ వేరియెంట్ ఇప్పుడు మన దేశంలోనూ వ్యాప్తి చెందుతోంది.
డెల్టా ప్లస్ వేరియెంట్ ఆందోళన చెందాల్సిన విషయమై భారత్ భావిస్తోంది. డెల్టా కన్నా డెల్టా ప్లస్ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ఇంకో వేవ్‌కు కారణమవుతుందని ఎలాంటి సమాచారం లేకపోయినా వైరస్ మార్పులకు గురవుతుండడం పట్ల సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ మార్పులకు లోనైతే మరింత ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందేందుకు అవకాశాలు ఉంటాయంటున్నారు.
ఇప్పటి వరకు భారత్‌లో మొత్తం 86 వరకు డెల్టా ప్లస్ వేరియెంట్ కేసులను గుర్తించారు. అయితే ఈ వేరియెంట్ మన దగ్గర వేగంగా వ్యాప్తి చెందడం లేదు. కానీ ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఏర్పడుతాయో తెలియడం లేదని, దానిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.