కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జనవరి 16వ తేదీన వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా తొలుత ప్రభుత్వ రంగానికి చెందిన ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేశారు. ప్రస్తుతం ప్రైవేటు రంగానికి చెందిన వైద్య సిబ్బందికి టీకాలను వేస్తున్నారు. తొలి దశలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు మొత్తం కలిపి 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్లకు టీకాలను వేయనున్నారు. అయితే గర్భంతో ఉన్న మహిళలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా ? అనే ప్రశ్న చాలా మందికి వస్తోంది. మరి ఇందుకు వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారంటే…
అమెరికాలో రెండు కోవిడ్ వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వగా ఇప్పటి వరకు 10వేల మంది గర్భిణీలకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఎవరిలోనూ ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. ఈ క్రమంలో గర్భంతో ఉన్న మహిళలు కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌచి వెల్లడించారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గర్భంతో ఉన్న వారు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు, కానీ వారికి ఇతర ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి, లేదంటే వారి ఇష్ట ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవచ్చు.. అని వెల్లడించింది.
అయితే భారత్‌లో మాత్రం గర్భంతో ఉన్న మహిళలకు ఇప్పుడప్పుడే టీకాలను ఇవ్వడం లేదు. క్లినికల్ ట్రయల్స్‌లో కేవలం సాధారణ ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్‌ను ఇచ్చి పరీక్షించారు. గర్భంతో ఉన్న మహిళలకు టీకాలను ఇచ్చి ప్రయోగాలు చేయలేదు. అందువల్ల వారికి టీకాలను ఇస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, ఏవైనా ఇన్‌ఫెక్షన్లు వస్తాయా ? అన్న వివరాలపై స్పష్టత లేదు. అందువల్ల భారత్ లో ప్రస్తుతానికైతే గర్భంతో ఉన్నవారికి టీకాలను ఇవ్వట్లేదు. అయితే ముందు ముందు ఈ విషయంలో మార్పులు చేస్తారేమో చూడాలి. కానీ టీకాలను తీసుకోవడం వల్ల గర్బంతో ఉన్న మహిళలకు దుష్ప్రభావాలు కలిగినట్లు ఇప్పటి వరకు అయితే అమెరికాలో వెల్లడికాలేదు. అందువల్ల గర్భిణీలకు కోవిడ్ టీకా సురక్షితమే అని కొందరు వైద్యులు చెబుతున్నారు. కానీ భారత్‌లో ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.