జనవరి 16వ తేదీ నుంచి భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇతర ఫ్రంట్ లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. కాగా మార్చి నెల నుంచి 50 ఏళ్లకు పైబడిన వారికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
కేంద్రం కోవిడ్ వ్యాక్సిన్‌కు రూ.35వేల కోట్లను ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేటాయించిందని మంత్రి తెలిపారు. అవసరం అనుకుంటే బడ్జెట్ మొత్తాన్ని ఇంకా పెంచుతామన్నారు. ఇప్పటికే ఆరోగ్య సిబ్బందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిందని, ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారని తెలిపారు. మార్చి నెల 3 లేదా 4వ వారం నుంచి 50 ఏళ్లకు పైబడిన వారికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు. అందులో భాగంగా 27 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు.
కాగా తొలి దశలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నామని, అయితే ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 7,580 మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత 12 మరణాలు సంభవించాయని, అయితే అవి కోవిడ్ వల్ల సంభవించిన మరణాలు కావని, వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉండడం వల్లే చనిపోయారని మంత్రి తెలిపారు.