10 Calcium Rich Foods : మన శరీరానికి అవసరమైన పోషకాల్లో క్యాల్షియం కూడా ఒకటి. ఎముకలను, దంతాలను ధృడంగా ఉంచడంలో ఇది ఎంతో అవసరం. అలాగే శరీరంలో వివిధ శారీరక విధులకు మద్దతును ఇవ్వడంలో కూడా క్యాల్షియం కూడా మనకు సహాయపడుతుంది. మనకు రోజుకు 1300 మిల్లీ గ్రాముల క్యాల్షియం అవసరమవుతుంది. కానీ మనలో చాలా మంది క్యాల్షియం లోపంతో బాధపడుతున్నారు. శరీరంలో క్యాల్షియం లోపించడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఎముకలు గుళ్లబారడం, బోలు ఎముకలు, దంతాల సమస్యలు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి క్యాల్షియం సప్లిమెంట్స్ ను వాడుతూ ఉంటారు. వీటికి బదులుగా క్యాల్షియం ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది.
ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల క్యాల్షియం లోపం తగ్గడంతో పాటు మరలా రాకుండా ఉంటుంది. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు ఏమిటి.. వీటిని తీసుకోవడం వల్ల మనకు ఎంత క్యాల్షియం అందుతుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాల్లో పాలు ఒకటి. ఒక కప్పు పాలల్లో 300 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. పాలను ఆహారంగా తీసుకునే వారు తక్కువ కొవ్వు లేదా కొవ్వు లేని పాలను తీసుకోవడం మంచిది. అలాగే ఆకుకూరలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఒక కప్పు వండిన ఆకుకూరలల్లో దాదాపు 180 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.
వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల క్యాల్షియం లోపం రాకుండా ఉంటుంది. బ్రోకలీలో కూడా క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు బ్రోకలీలో 60 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. స్మాలన్, సార్డినెస్ వంటి చేపలల్లో కూడా క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. దాదాపు 180 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఈ చేపల నుండి అందుతుంది. సోయా టోఫు ను తీసుకోవడం వల్ల కూడా మనకు తగినంత క్యాల్షియం అందుతుంది. ఒక కప్పు గట్టి టోఫులో 350మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. బాదంపప్పులో కూడా క్యాల్షియం ఉంటుంది. సుమారు 76 మిల్లీ గ్రాముల క్యాల్షియంను మనం బాదంపప్పు నుండి పొందవచ్చు. చియా గింజలల్లో కూడా క్యాల్షియం ఉంటుంది.
ఒక ఔన్సు( 28 గ్రాముల) చియా విత్తనాల్లో 179 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. బీన్స్ లో కూడా క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు ఉడికించిన బీన్స్ లో 160 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. కాయ ధాన్యాల్లో ప్రోటీన్ తో పాటు క్యాల్షియం కూడా ఉంటుంది. ఒక కప్పు వండిన పప్పు దినుసుల్లో 38మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఎండిన అంజీరా పండ్లల్లో కూడా క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. అర కప్పు డ్రై అంజీరాలలో 120 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల క్యాల్షియం లోపం తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది.