Atukula Rava Kesari : అటుకులతో మనం రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అటుకులతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో అటుకుల రవ్వ కేసరి కూడా ఒకటి. అటుకులతో చేసే ఈ రవ్వ కేసరి చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా ఉడిపి ప్రాంతంలో తయారు చేస్తారు. క్రిష్ణాష్టమికి దీనిని తయారు చేసి నైవేధ్యంగా సమర్పిస్తూ ఉంటారు. కేవలం నైవేద్యంగానే కాకుండా తీపి తినాలనిపించినప్పుడు కూడా దీనిని తయారు చేసి తీసుకోవచ్చు. ఈ రవ్వ కేసరిని తయారు చేయడం చాలా సులభం. చాలా తేలికగా, చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా అటుకులతో రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల రవ్వ కేసరి తయారీకి కావల్సిన పదార్థాలు..
మందపాటి అటుకులు – ఒక కప్పు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 3 టేబుల్ స్పూన్స్, ఎండుద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 2 కప్పులు, పంచదార – ముప్పావు కప్పు నుండి ఒక కప్పు, ఫుడ్ కలర్ – చిటికెడు, యాలకుల పొడి – అర టీ స్పూన్, పచ్చకర్పూరం – చిటికెడు.
అటుకుల రవ్వ కేసరి తయారీ విధానం..
ముందుగా అటుకులను కళాయిలో వేసి చిన్న మంటపై క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి రవ్వలాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత అటుకుల రవ్వ వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత పంచదార వేసి కలపాలి. ఇందులోనే కలర్ వేసికలపాలి. దీనిని దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత యాలకుల పొడి, పచ్చకర్పూరం, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల రవ్వ కేసరి తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు అటుకులతో కేసరిని తయారు చేసి తీసుకోవచ్చు.