Health Benefits : ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు అనారోగ్యకరమైన ఆహారాలను తింటున్నారు. ఫలితంగా వ్యాధులను వారే స్వయంగా కొని తెచ్చుకుంటున్నారు. అయితే మన పూర్వీకులు చాలా సహజసిద్ధమైన ఆహారం తినేవారు. కనుకనే వారు వృద్ధాప్యంలోనూ ఎంతో దృఢంగా ఉంటున్నారు. కాబట్టి వారిలా మనం కూడా దృఢంగా ఉండాలన్నా.. ఏ వ్యాధి రాకుండా చూసుకోవాలన్నా.. అందుకు రోజూ రాగి జావను తాగాల్సి ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగులను శుభ్రం చేసి వాటిని నీళ్లలో వేసి ఒక రాత్రి మొత్తం నానబెట్టాలి. తరువాత వాటిని ఒక పలుచని గుడ్డలో వేసి మూటగా కట్టాలి. చీకటిగా ఉండే ప్రదేశంలో ఆ మూటను ఉంచాలి. ఈ క్రమంలో ఒక రోజు తరువాత మూటను విప్పాలి. దీంతో అందులో రాగులకు మొలకలు వస్తాయి. ఇలా మొలకలు వచ్చిన రాగులను ఎండబెట్టాలి. అనంతరం అవి బాగా ఎండిన తరువాత వాటిని పొడి చేయాలి. ఆ పొడిని ఒక పాత్రలో నిల్వ చేసుకోవాలి. దీన్నే రాగి మాల్ట్ పౌడర్ అని కూడా అంటారు.
ఇక చల్లని పాలను ఒక చిన్న గ్లాస్‌లో తీసుకుని అందులో ఒక టీస్పూన్ రాగి మాల్ట్ పొడిని కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని అందులో పాలు పోసి మరిగించాలి. పాలు బాగా మరుగుతున్నప్పుడు అందులో ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ కలపాలి. దీంతో రాగి మాల్ట్ జావ సిద్ధం అవుతుంది. తరువాత అందులో బెల్లం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుని మధ్యాహ్నం తీసుకోవచ్చు. లేదా వేడిగా కావాలనుకుంటే తయారు చేసిన వెంటనే తాగవచ్చు. దీన్ని ఉదయం, సాయంత్రం కూడా తీసుకోవచ్చు. దీంతో ఎన్నో లాభాలు కలుగుతాయి.
రాగి మాల్ట్ జావను రోజుకు ఒక గ్లాస్ తాగితే చాలు.. అమితమైన శక్తి లభిస్తుంది. రోజూ నీరసంగా, నిస్సత్తువగా ఉందని భావించేవారు.. శారీరక శ్రమ, వ్యాయామం అధికంగా చేసేవారు.. ఇలా రాగి మాల్ట్ జావను తయారు చేసుకుని తాగితే శక్తి బాగా లభిస్తుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఎంత పనిచేసినా అలసిపోరు.
ఈ జావను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం, గ్యాస్, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. షుగర్, కొలెస్ట్రాల్, బీపీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఎండాకాలంలో దీన్ని చల్లగా తాగితే వేసవి తాపం నుంచి ఉపశమనం లభించి శరీరం చల్లగా మారుతుంది. వేడి తగ్గుతుంది.
ఇక ఈ జావను తాగితే రక్తం బాగా తయారవుతుంది. అధిక బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది. ఇలా రాగి మాల్ట్ జావతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.