Carom Seeds : మనం వంటింట్లో ఉపయోగించే దినుసులలో వాము కూడా ఒకటి. చాలా కాలం నుండి భారతీయులు తమ వంటల్లో వామును ఉపయోగిస్తున్నారు. వాము, వాము మొక్క కూడా చక్కని వాసననను కలిగి ఉంటాయి. వాము మొక్కకు తెల్లని పూలు ఉంటాయి. ఈ పూల నుండే వాము మనకు లభిస్తుంది. మనం వివిధ రకాల వంటకాలలో వామును ఉపయోగిస్తుంటాం. వాము వంటల రుచిని పెంచడమే కాకుండా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వాము ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో వామును ఉపయోగించి అనేక రకాల ఔషధాలను తయారు చేస్తారు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో వాము మనకు ఉపయోగపడుతుంది.
వాము నుండి నూనెను కూడా తీస్తారు. వామును మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. తిన్న ఆహారం జీర్ణకానప్పుడు వామును వేడి నీటితో కలిపి నమిలి మిగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా వామును వేడి నీటితో కలిపి నమిలి మిగడం వల్ల దగ్గు కూడా తగ్గుతుంది. రాత్రి పూట పొడి దగ్గుతో బాధ పడుతున్నప్పుడు వామును, తమలపాకుతో కలిపి తినడం వల్ల పొడి దగ్గు తగ్గుతుంది.
వామును వేడి నీటితో కలిపి నమిలి పుక్కిలించడం వల్ల పన్ను నొప్పి తగ్గుతుంది. వామును, మిరియాలను, ఉప్పును సమపాళ్లలో తీసుకుని చూర్ణంగా చేసి నిల్వ చేసుకోవాలి. రోజూ భోజనానికి ముందు ఈ మిశ్రమాన్ని పావు టీ స్పూన్ చొప్పున తీసుకోవడం వల్ల అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. జ్వరంతో బాధపడుతున్నప్పుడు వామును, జీలకర్రను, ధనియాలను సమపాళ్లలో తీసుకుని నీటిలో వేసి మరిగించి వడకట్టి ఆ నీటిని తాగడం వల్ల జ్వరం తగ్గుతుంది.
బాలింతలలో పాల ఉత్పత్తిని పెంచే శక్తి కూడా వాముకు ఉంది. వాముతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల మూత్రాశయంలో ఉండే రాళ్లు తొలగిపోతాయి. వామును తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మూత్ర పిండాలలో రాళ్లు కూడా తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. జలుబు, తలనొప్పితో బాధపడుతున్నప్పుడు వామును కచ్చా పచ్చాగా దంచి చిన్న వస్త్రంలో మూట కట్టి వాసన చూస్తూ ఉండడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. పిల్లలకు జలుబు చేసినప్పుడు ఇలా వాము మూటను పిల్లల తల దిండు దగ్గర ఉంచడం వల్ల జలుబు, ముక్కు దిబ్బడ నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
వామును తరచూ వాడడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఛాతిలో కఫం పేరుకుపోయినప్పుడు అర లీటర్ నీటిలో ఒక టీ స్పూన్ చొప్పున వామును, పసుపును వేసి మరిగించి చల్లార్చాలి. ఇలా చల్లార్చిన మిశ్రమానికి తేనెను కలిపి తీసుకోవడం వల్ల జలుబు తగ్గుతుంది. ఛాతిలో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది. రెండు టీ స్పూన్ల వాము పొడిని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తాగడం వల్ల ఊపిరితిత్తులకు గాలిని చేర వేసే మార్గం శుభ్రపడుతుంది.
ఆస్తమాను తగ్గించే గుణం కూడా వాముకు ఉంది. బెల్లంతో వామును కలిపి తీసుకోవడం వల్ల ఆస్తమా వ్యాధి గ్రస్తులకు మంచి ఫలితం ఉంటుంది. వామును నమిలి రసాన్ని మింగడం వల్ల కొండ నాలుక వాపు తగ్గుతుంది. వాపు తగ్గే వరకు ఇలా రసాన్ని మింగుతూనే ఉండాలి. వామును నీటితో కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే నల్ల మచ్చలు తొలగిపోతాయి. ఈ పేస్ట్ ను గాయాలపై రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి.
వాముతో చేసిన పేస్ట్ ను వాడడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. వాముతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల స్త్రీలలో నెలసరి సరిగ్గా రావడమే కాకుండా నెలసరి సమయంలో వచ్చే నొప్పులు కూడా తగ్గుతాయి. ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ వామును వేసి ఒక రోజంతా నానబెట్టి ఆ నీటితో మగ వారు పురుషాంగాన్ని కడుక్కోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.