బెంగాలీ వాళ్ళు పెరుగులో గుప్పెళ్ల కొద్దీ పంచదార కుమ్మరించుకు తింటారు. అలాగే బెల్లం కలిపిన పాలను తోడుపెట్టి చేసే మిస్తీ దొయి అనే పెరుగు వీళ్ళకి చాలా ఇష్టం. బెనారస్ వాళ్ళు పెరుగులో పంచదార, పళ్ళ ముక్కలు కలిపిన లస్సీ తెగ తాగుతారు. ఇంకా ఉత్తర భారత దేశంలో లస్సీ అంటే పెరుగు, పంచదార మాత్రమే కాదు కోవా, డ్రై ఫ్రూట్స్, రకరకాల ఫ్లేవర్స్ కలిపి కలగాపులగం చేస్తారు. పంజాబీ వాళ్ళు వాషింగ్ మెషీన్నే లస్సీ మేకర్ గా మార్చి గ్యాలన్ల కొద్దీ తాగుతారు.
పెరుగును అన్నంలో కలుపుని తినడం మన దక్షిణ భారత దేశంలోనే చూడగలం. దేశంలో పెరుగుని ఇన్ని రకాలుగా తినగా లేనిది మన తెలుగువారు చక్కగా పెరుగన్నంలో అరటి పండో, మామిడి పండో నంజుకు తింటే ఏమంత ఆరోగ్యమేమీ చెడిపోదు లెండి.
నాకైతే ఇదొక కంఫర్ట్ ఫుడ్. ఏమీ లేకపోయినా పెరుగన్నం ఉంటే చాలు. కంచం నిండా పెరుగన్నం కలిపి అందులో అరటిపండు పిసుక్కుని తింటుంటే ఎంత హాయిగా ఉంటుందోనండి(ఇంట్లోనే సుమండీ). వేసవి కాలం పెరుగన్నంలో మామిడి పండు పిసుక్కుని తిని మధ్యాహ్నం నిద్దరోతే మళ్లీ సాయంత్రం దాకా మెలకువ రాదు.
కఫం పడుతుందని, జలుబు చేస్తుందని రాత్రుళ్ళు తినొద్దంటారు. అంతకంటే అనారోగ్య కారణాలు నాకేం కనిపించలేదు. వొళ్ళు చేస్తుందని కూడా అంటారు దీన్ని పెద్దగా పట్టించుకోను.