హెల్త్ టిప్స్

అరటిపండ్లు-పాలు కలిపి తింటున్నారా? అయితే మీరు ఇది చదవాల్సిందే!

మనలో బనానా మిల్క్‌షేక్‌ ఇష్టపడనివారెవరో చెప్పండి? మంచి ఎండాకాలంలో లంచ్‌తో పాటు ఓ మిల్క్‌షేక్‌ ఉంటే ఆ మజానే వేరు. అందులో బనానా అయితే చెప్పేపనే లేదు. అంత రుచిని కలిగిఉండే ఈ కలయిక, ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిస్తే షాకే. అవును. అరటిపండ్లు, పాల కలయిక శరీరానికి మంచిది కాదని డాక్టర్లు, ఆహారనిపుణులు హెచ్చరిస్తున్నారు. రకరకాల రుగ్మతలకు ఈ కలయిక కారణమవుతుందని చెపుతున్నారు.

పాలు-అరటిపండ్ల కాంబినేషన్‌ గురించి ఏళ్ల తరబడి చర్చ నడుస్తూనేఉంది. కొంతమంది ఇది గొప్ప కలయిక అనీ, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెపితే, మరికొంతమంది ఇది ప్రమాదకారి అని అంటున్నారు. ప్రఖ్యాత ఆహార నిపుణులు డా. హరీశ్‌ కుమార్‌ ‘ మేము దీన్ని పూర్తిగా నిషేధించాం. ఎందుకంటే ఇది శరీరానికి చాలా కీడు చేస్తుంది. కావాలంటే ముందుగా పాలు తాగి, 20 నిముషాల తర్వాత అరటిపండు తినండి. అంతేకానీ రెండిటినీ మాత్రం కలపొద్దు. ఇది జీర్ణక్రియను మందగింపజేసి, నిద్రాకృతిని చెడగొడుతుంది’ అని చెప్పారు. ఈ వాదనకు విరుద్ధంగా, ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్‌ శిల్పా ఆరోరా, ఇది చాలా మంచి ఆహారమని, వ్యాయామం చేసేవారికి, మల్లయోధులకు, శరీరాన్ని పెంచుకోవాలనుకునేవారికి, అధిక శారీరకశ్రమ చేసేవారికి ఎంతో ఉపయుక్తమని ఆమె అన్నారు. అయితే, ఆస్తమా, ఎలర్జీలు కలిగినవారు తినకూడదని, ఇది కఫ సంబంధిత రుగ్మతలను పెంచుతుందని శిల్ప తెలిపారు.

banana and milk if you are taking them together then know this

ప్రాచీన ఆయుర్వేదం ప్రకారం, ప్రతీ ఆహారం, తనదైన రుచి, జీర్ణానంతర ఫలితం, వేడి లేదా చలువదనం కలిగిఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి ఆహారం బాగా జీర్ణమవుతుందా లేదా అనేది వారి జఠరాగ్ని నిర్ణయిస్తుంది. అందుకే ఆహారపదార్థాల సరైన కలయికకు ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యతనిస్తుంది. దాని ప్రకారం విడనాడాల్సిన ఆహార కలయికల్లో పాలు-అరటిపండు అగ్రస్థానంలో నిలిచింది. ‘ది కంప్లీట్‌ బుక్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ హోమ్‌ రెమెడీస్‌, ఏ కాంప్రెహెన్సివ్‌ గైడ్‌ టు ది ఏన్షెంట్‌ హీలింగ్‌ ఆఫ్‌ ఇండియా’ అని వసంత్‌ లాడ్‌ రాసిన పుస్తకంలో ఏ ఫలాన్నయినా పాలతో కలిపి సేవించకూడదు అని ఖరాకండిగా చెప్పారు. పాలు-అరటిపండు కలిపి తింటే, అది జఠరాగ్నిని ఆర్పివేసి, విషపదార్థాలను విడుదల చేస్తుందని, ఇంకా, జలుబు, దగ్గు, ఎలర్జీలను కలుగజేస్తుందని తెలిపింది. నిజానికి ఇవి రెండు తియ్యగా ఉండి, చలువ చేసే గుణాన్ని కలిగిఉన్నప్పటికీ, జీర్ణానంతర ఫలితం వేరుగా ఉంటోంది.

ఆయుర్వేద వైద్యులు డా. వైద్య, డా. సూర్యభగవతిల ప్రకారం, ఇదొక చెడు కలయిక, దీన్ని ‘విరుద్ధాహారం’గా పిలుస్తారు. ఇది ఒకరకమైన విషపదార్థాన్ని తయారుచేస్తుంది. శరీరంలో కలిగే అసంతులిత, వ్యాధులకు ఈ విషమే కారణభూతమవుతుందని వారు చెపుతున్నారు. కాబట్టి, రెండిటిని కలిపి తినే అలవాటును మానుకోండి. విడివిడిగా ఇవి రెండు గొప్ప ఆహారాలు కనుక, ఆ రకంగా తినడం మేలు చేస్తుంది. విడిగా ఉన్న ఆ గొప్ప పోషకాలను కలయిక చంపేసేవిధంగా ఉన్నందున ఈ కలయిక ఎంతో దుఃఖహేతువని గుర్తించండి.

Admin

Recent Posts