మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రతి ఏటా చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. టైప్ 1, టైప్ 2 అని రెండు రకాల డయాబెటిస్ లతో చాలా మంది సతమతం అవుతున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిత్యం డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే డయాబెటిస్ వచ్చిందంటే చాలు.. మన దగ్గర చాలా మందిని అన్నం మానేయమని చెబుతుంటారు. మరి డయాబెటిస్ ఉన్నవారు నిజంగానే అన్నం మానేయాలా ? అన్నం తినకూడదా ? తింటే ఏమవుతుంది ? వంటి సందేహాలకు ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్నవారు అన్నం నిరభ్యంతరంగా తినవచ్చు. మానేయాల్సిన పనిలేదు. కాకపోతే ఒక పూటకే పరిమితం కావాలి. అది కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. లేదా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవచ్చు. ఇక అన్నం తినేటప్పుడు అందులో కలుపుకునే కూర పరిమాణం ఎక్కువగా ఉండాలి. దీనివల్ల అన్నం గ్లైసీమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఫలితంగా అన్నం తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
డయాబెటిస్ వచ్చిన వారు అన్నం తింటుంటే.. దాంతోపాటు తాజా కూరగాయలు, పండ్లు తినేలా చూసుకోవాలి. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరగకుండా ఉంటాయి. ఇక డయాబెటిస్ ఉన్నవారు వ్యాయామం కచ్చితంగా చేయాలి. ఈ విధమైన ఆహార శైలిని పాటిస్తే.. డయాబెటిస్ ఉన్న వారు కూడా ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా అన్నం తినవచ్చు. దాని వల్ల ఏ ప్రమాదం ఉండదు..!