Carbohydrates : పూర్వకాలంలో మన పెద్దలు రోజూ నిద్ర లేచింది మొదలు మళ్లీ నిద్రించే వరకు శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు. వ్యవసాయంతోపాటు కుల వృత్తులు ఏది చేసినా సరే శారీరక శ్రమ ఎక్కువగానే ఉంటుంది. దీని వల్ల ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. అందువల్ల వారు కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం తినేవారు. అన్నం, జొన్నలు, మొక్కజొన్న పిండి ఇలాంటి వాటిని తినేవారు. అయితే ప్రస్తుతం చాలా మంది కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేస్తున్నారు కనుక.. ఇలాంటి ఆహారాలు వారికి అవసరం లేదు.
ప్రస్తుతం చాలా మంది శారీరక శ్రమ ఎక్కువగా లేని ఉద్యోగాలను చేస్తున్నారు. కనుక వారికి అన్నం లాంటి అధిక కార్బొహైడ్రేట్లు కలిగిన ఆహారాలు అవసరం లేదు. అలాగే ఇడ్లీ, దోశ, వడ, బొండా.. వంటి వాటిల్లోనూ కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని కూడా చాలా మంది రోజూ తింటున్నారు. కానీ శారీరక శ్రమ ఎక్కువగా లేని ఉద్యోగాలకు అసలు ఈ ఆహారాలు అవసరం లేదు. కానీ అధిక శాతం మంది ఈ ఆహారాలనే తింటున్నారు. దీని వల్ల శరీరం క్యాలరీలను ఖర్చు చేయలేకపోతోంది. ఫలితంగా బరువు పెరిగి అనేక వ్యాధులు వస్తున్నాయి.
అధిక కార్బొహైడ్రేట్లు కలిగిన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. దీంతో డయాబెటిస్ వస్తుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కనుక కార్బొహైడ్రేట్లను తీసుకోవడం తగ్గించాలి. మరి ఇతర ఏ ఆహారాలను తినాలి.. అంటే.. చిరు ధాన్యాలను, పండ్లను, తాజా ఆకు కూరలు, కూరగాయలు, నట్స్, విత్తనాలను తినవచ్చు. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఉదయం ఏవైనా పండ్లు, నానబెట్టిన గింజలు, విత్తనాలను తినాలి. తరువాత గ్రీన్ టీ సేవించాలి. మధ్యాహ్నం భోజనంలో పుల్కా ఏవైనా కూరలు తినాలి. సాయంత్రం విత్తనాలు తినాలి. రాత్రి 7 లోపే భోజనం చేయాలి. పండ్లు లేదా ఏదైనా కూరతో రెండు పుల్కాలు తింటే చాలు. ఈ విధమైన ఆహారపు అలవాట్లను పాటించడం వల్ల శరీరంలో పెద్దగా క్యాలరీలు చేరవు. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది. ఇలాంటి డైట్‌ను పాటిస్తే ఎన్నో లాభాలు కలుగుతాయి. అధిక బరువు తగ్గుతారు. షుగర్ అదుపులోకి వస్తుంది. బీపీ ఉండదు. కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోతాయి. కనుక అధిక కార్బొహైడ్రేట్లు కాకుండా తక్కువ కార్బొహైడ్రేట్లు ఉండే ఆహారాలను తింటే దాంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.