Cabbage Paratha : మనం గోధుమ పిండితో రకరకాల పరాటాలను తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా చేసుకోదగిన పరాటాలలో క్యాబేజి పరాటా కూడా ఒకటి. ఈ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. క్యాబేజిని తినని వారు కూడా ఈ పరాటాలను ఇష్టంగా తింటారు. ఎటువంటి కూరలు లేకపోయినా కేవలం పెరుగుతో తిన్నా కూడా ఈ పరాటాలు రుచిగా ఉంటాయి. గోధుమపిండి అలాగే క్యబేజితో రుచికరమైన పరాటాలను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజి పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాబేజి తురుము – ఒక కప్పు, గోధుమ పిండి – రెండు కప్పులు, చిన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తురుము – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
క్యాబేజి పరాటా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత మరో గిన్నెలో క్యాబేజి తురుమును తీసుకోవాలి. ఇందులో మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా కలిపిన పిండిని మరోసారి కలుపుకోవాలి. తరువాత ఈ పిండిని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ ముందుగా చేత్తో వెడల్పుగా వత్తుకోవాలి.
తరువాత ఇందులో తగినంత క్యాబేజి మిశ్రమాన్ని ఉంచి అంచులను మూసి వేయాలి. తరువాత దీనిని పొడి పిండి చల్లుకుంటూ పరాటాలా వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక పరాటాను వేసి కాల్చుకోవాలి. ముందుగా రెండు వైపులా కొద్దిగా కాల్చుకున్న తరువాత నూనె లేదా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి పరాటా తయారవుతుంది. దీనిని పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా లేదా లంచ్ బాక్స్ లోకి ఇలా క్యాబేజితో రుచిగా పరాటాను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.