Children Health : మన శరీరానికి సరైన ఆకృతి ఇవ్వడంలో ఎముకలు, కీళ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. శరీరంలో అవయవాలను రక్షించడంలో, కండరాలకు పట్టును ఇవ్వడంలో ఎముకలు దోహదపడతాయి. ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పిల్లల్లో ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండడం మరింత అవసరం. ఎందుకంటే పిల్లల్లో ఎముకలు పెద్దవిగా మరింత బలంగా, త్వరగా పెరుగుతాయి. కౌమార దశకు చేరుకున్న తరువాత ఎముకల సాంద్రత వేగంగా అభివృద్ది చెందుదుంది. యుక్త వయసు చేరుకున్న తరువాత ఎముకల సాంద్రత పెరగడం ఆగిపోతుంది. కనుక చిన్నతనంలోనే పిల్లలకు ఎముకల పెరుగుదలకు కావల్సిన పోషకాలు అందేలా చూడాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల మనం పిల్లల్లో ఎముకల పెరుగుదల చక్కగా ఉండేలా చూసుకోవచ్చు.
ఎముకలను ఆరోగ్యంగా, ధృడంగా ఉంచడంలో అలాగే ఎముకలు క్యాల్షియంను ఎక్కువగా గ్రహించేలా చేయడంలో విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ చాలా మంది పిల్లలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. విటమిన్ డి లోపించడం వల్ల ఎముకల సాంద్రత తగ్గడంతో పాటు ఎముకలు బలహీనంగా తయారవుతాయి. శరీరంలో విటమిన్ డి తగినంత ఉండడం వల్ల ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. రోజూ 15 నుండి 20 నిమిషాల పాటు ఎండలో కూర్చోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ డి లభిస్తుంది. అలాగే విటమిన్ డి ఎక్కువగా ఉండే లివర్, చేపలు, చీస్, పిస్తా వంటి ఆహార పదార్థాలను పిల్లలకు ఇవ్వడం వల్ల కూడా వారిలో విటమిన్ డి లోపం తలెత్తుకుండా ఉంటుంది. దీంతో వారిలో ఎముకల ఎదుగుదల చక్కగా ఉంటుంది.
అలాగే ఎముకలను ధృడంగా ఉంచడంలో, ఎముకల నిర్మాణంలో, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో క్యాల్షియం ముఖ్య పాత్ర పోషిస్తుందని మనందరికి తెలుసు. పాలు, పాల ఉత్పత్తులు, పాలకూర, నువ్వులు, బెండకాయ, నారింజ పండ్లు, చేపలు, సోయా ఉత్పత్తులు, గుడ్లు వంటి ఆహారాలను పిల్లలకు ఎక్కువగా ఇవ్వడం వల్ల వారి శరీరానికి తగినంత క్యాల్షియం లభిస్తుంది. దీంతో వారిలో క్యాల్షియం లోపం తలెత్తకుండా ఉంటుంది. తద్వారా వారిలో ఎముకల పెరుగుదల చక్కగా ఉంటుంది. ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే పిల్లలకు విటమిన్ కె, మెగ్నీషియం వంటి పోషకాలు చక్కగా అందేలా చూసుకోవాలి. ఎముకల సాంద్రత సరిగ్గా ఉండేలా చేయడంలో, ఎముకలకు సంబంధించిన రికెట్స్, ఆస్ట్రోపోరిసైసిస్ వంటి వ్యాధులు రాకుండా చేయడంలో ఈ పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
అలాగే ఈ పోషకాలు క్యాల్షియంతో కలిసి పిల్లల్లో ఎముకలు ధృడంగా ఉండేలా చేయడంలో సహాయపడతాయి. విటమిన్ కె, మెగ్నీషియం ఎక్కువగా ఉండే పాలకూర, క్యాబేజ్, మొలకెత్తిన విత్తనాలు వంటి వాటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లలు సెల్ ఫోన్ లకు, వీడియో గేమ్స్ కే పరిమితమవుతున్నారు. ఎక్కువ సేపు కూర్చొని ఉండడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కనుక వాకింగ్, జాజింగ్, రన్నింగ్ వంటి వాటితో పాటు బయట ఎక్కువగా ఆటలు ఆడేలా చూడాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఎముకలు బలంగా, ధృడంగా తయారవుతాయి. వీటి వల్ల పిల్లల్లో మానసిక, శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల పిల్లల్లో ఎముకల ఎదుగుదల చక్కగా ఉండడంతో పాటు ఎముకలు ధృడంగా, ఆరోగ్యంగా ఉంటాయి. వారిలో ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా కూడా ఉంటాయి.