Copper Water : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే పరగడుపున టీ, కాఫీలను తాగే అలవాటు ఉంటుంది. వీటిని తాగడం వల్ల మనకు తాత్కాలిక ఆనందం మాత్రమే లభిస్తుంది. కానీ ఈ టీ, కాఫీల వల్ల మన ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటిని తాగిన వెంటనే ఫలితం కనబడకపోయినా భవిష్యత్తులో మాత్రం మనకు ముప్పు తప్పదని నిపుణులు హెచరిస్తున్నారు. ఇలా ఉదయం లేచిన వెంటనే టీ, కాఫీ లను తాగడానికి బదులుగా నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా ఉదయం పరగడుపున నీటిని తాగడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. అసలు పరగడుపున ఎన్ని నీటిని తాగాలి.. ఏ నీటిని తాగాలి.. ఇలా నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం లేవగానే పరగడుపున ఒక లీటర్ నీటిని తాగాలి. ఇలా తాగిన గంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఇలా నీటిని తాగడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. పెద్ద ప్రేగు శుభ్రపడి మనం తిన్న ఆహారం నుండి అధిక పోషకాలను గ్రహిస్తుంది.
పరగడుపున నీటిని తాగడం వల్ల రక్తంలోని మలినాలు తొలగిపోయి రక్తం శుద్ధి అవుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా మనం తరచూ ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. ఉదయం పరగడుపున నీటిని తాగడం వల్ల 24 శాతం మన శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. అధిక బరువుతో బాధపడే వారు ఇలా నీటిని తాగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. త్వరగా బరువు తగ్గుతారు. పరగడుపున ఒక లీటర్ నీటిని తాగలేని వారు కనీసం అర లీటర్ నీటిని అయినా తాగాలని నిపుణులు తెలియజేస్తున్నారు.
పరగడుపున ఇలా సాధారణ నీటిని తాగడానికి బదులుగా రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. రాత్రి పడుకునే ముందు రాగి పాత్రలో నీటిని పోసి నిల్వ చేసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ నీటిని పరగడుపున తాగాలి. ఇలా రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. మెదడు పనితీరు పెరుగుతుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు క్రమపడుతుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది.
ఇలా రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల చిన్న వయసులో జుట్టు తెల్లబడడం, చర్మం ముడతలు పడటం, వయసు ఎక్కువగా ఉన్న వాళ్ల లాగా కనిపించడం వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు కరిగిపోయి త్వరగా బరువు తగ్గుతారు. గుండె సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. ఎముకలు దృఢంగా మారతాయి. శరీరం దృఢంగా, ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఎదిగే పిల్లలకు కూడా రోజూ ఉదయం పరగడుపున రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని ఇవ్వడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఈ విధంగా పరగడుపున రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని ఒక లీటర్ మోతాదులో తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.