Ragi Chapathi : రాగి పిండితో సుతి మెత్త‌ని పుల్కాల‌ను త‌యారు చేసే విధానం..!

Ragi Chapathi : మ‌న‌కు విరివిరిగా ల‌భించే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి. అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డేయ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం జావ‌, ఉప్మా, సంగ‌టి, రోటి, చ‌పాతీ, పుల్కా వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. రాగి పిండితో చేసే పుల్కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రాగి పిండితో పుల్కాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి పుల్కా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రాగిపిండి – ఒక క‌ప్పు, నీళ్లు – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌.

Ragi Chapathi very easy to make soft and smooth ones
Ragi Chapathi

రాగి పుల్కా త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో ఒక క‌ప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే త‌గినంత ఉప్పు వేసి నీటిని మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత రాగి పిండి వేసి మంట‌ను చిన్న‌గా చేసి అంతా క‌లిసేలా గంటెతో క‌లుపుకోవాలి. ఇలా క‌లుపుకున్న త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి క‌ళాయిపై మూత‌ను ఉంచాలి. ఈ రాగి పిండి మిశ్ర‌మం గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత చేత్తో బాగా క‌లుపుకోవాలి. అవ‌స‌ర‌మైతే కొద్దిగా నీటిని చ‌ల్లుకుంటూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి.

త‌రువాత మ‌న‌కు కావ‌ల్సిన ప‌రిమాణంలో పిండిని తీసుకుని ముద్ద‌గా చేసుకోవాలి. మిగిలిన పిండిపై మూత‌ను ఉంచాలి. ఈ పిండి ముద్ద‌పై పొడి రాగిపిండిని వేసుకుంటూ మ‌రీ ప‌లుచ‌గా, మ‌రీ మందంగా కాకుండా చ‌పాతీలా వ‌త్తుకోవాలి. ఇలా అన్ని పుల్కాల‌ను వ‌త్తుకున్న త‌రువాత వాటిపై త‌డి వ‌స్త్రాన్ని వేసి ఉంచాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద పెనాన్ని ఉంచి పెనం వేడ‌య్యాక పుల్కాను వేసి రెండు వైపులా కొద్ది కొద్దిగా కాల్చుకోవాలి. త‌రువాత నేరుగా మంటపై ఉంచి రెండు వైపులా చ‌క్క‌గా కాల్చుకోవాలి.

ఇలా కాల్చుకున్న పుల్కాల‌ను హాట్ బాక్స్ లో లేదా గిన్నెలో ఉంచి గిన్నెపై మూత‌ను ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మెత్త‌గా రుచిగా ఉండే రాగి పుల్కాలు త‌యార‌వుతాయి. వీటిని చికెన్, మ‌ట‌న్ వంటి కూర‌ల‌తోపాటు ఇత‌ర కూర‌ల‌తో కూడా క‌లుపుకుని తిన‌వ‌చ్చు. ఇలా రాగి పిండితో పుల్కాల‌ను చేసుకుని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది.

D

Recent Posts