కోవిడ్ వచ్చి నయం అయిన వారు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. త్వరగా కోలుకునేందుకు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి సహజంగానే పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా జుట్టు రాలడం, అలసట, నిద్రలేమి, హార్మోన్ల సమస్యలు వస్తాయి. అందువల్ల వారు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రోటీన్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అడ్రినల్ గ్రంథులు సరిగ్గా పనిచేస్తాయి. హార్మోన్లు సమతుల్యం అవుతాయి. చర్మ కణాలు మరమ్మత్తులకు గురవుతాయి. జుట్టు, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. ఆందోళన తగ్గుతుంది. ఈ సమస్యలన్నీ కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారికి సహజంగానే వస్తాయి. కనుక అవి రాకుండా ఉండాలంటే ప్రోటీన్లు ఉండే ఆహారాలను ఎక్కువగా తినాల్సి ఉంటుంది.
కోవిడ్ వచ్చిన వారిలో రోగ నిరోధక వ్యవస్థపై బాగా ప్రభావం పడుతుంది. అది మళ్లీ సరిగ్గా పనిచేయాలంటే ప్రోటీన్లు అవసరం. అందువల్ల ఎటు చూసినా ప్రోటీన్లు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇతర సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.
ప్రోటీన్లు మనకు ఎక్కువగా కోడి గుడ్లు, క్యాబేజీ, కాలిఫ్లవర్, ఆకుపచ్చని కూరగాయలు, చేపలు, చికెన్, పప్పు దినుసులు, పచ్చి బఠానీలు, బీన్స్, శనగలు, మొలకెత్తిన పెసల్లో ఎక్కువగా లభిస్తాయి. కనుక ఈ ఆహారాలను తీసుకుంటే కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవచ్చు. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా నివారించవచ్చు.